ప్రాదేశిక ఎన్నికలకు మోగిన నగారా
ABN , Publish Date - Oct 20 , 2026 | 12:21 AM
జిల్లాలో ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం), జడ్పీటీసీ (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం) ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు.
నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు 21 నుంచి నామినేషన్ల స్వీకరణ
వచ్చే నెల మూడో తేదీన పోలింగ్
ఐదో తేదీన ఓట్ల లెక్కింపు
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిశోర్
విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఎంపీటీసీ (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం), జడ్పీటీసీ (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం) ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. నాలుగు జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నోటిఫికేషన్ ప్రకారం 21న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబరు 23 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అని, 24న పరిశీలన ఉంటుందన్నారు. నవంబరు మూడో తేదీన పోలింగ్, ఐదో తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటాయని వివరించారు. నవంబరు ఏడో తేదీన పరోక్ష ఎన్నికల నోటీస్ (జడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం) విడుదల చేస్తామని, 11న ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. పరిషత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారని, జడ్పీ సీఈవో అదనపు ఎన్నికల అథిరిటీగా ఉంటారన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 16 జోన్లను ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 203 పోలింగ్ కేంద్రాలను చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల వ్యయ పరిమితి ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు, జడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షలుగా నిర్ణయించినట్టు పేర్కొంటూ అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
జడ్పీటీసీ అభ్యర్థులు జడ్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆర్వో ఛాంబర్‌లో, ఎంపీటీసీ అభ్యర్థులు ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. పారదర్శక ఎన్నికల ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.