Share News

కూటమికి చిగురిస్తున్న ఆశలు

ABN , Publish Date - Nov 14 , 2026 | 10:36 PM

మండల ఎంపీపీ పీఠంపై కూటమికి ఆశలు చిగురిస్తున్నాయి. చింతపల్లి-3 జనసేన ఎంపీటీసీ సభ్యురాలు కిముడు పార్వతిని ఎంపీపీగా చేయాలని కూటమి నాయకులు కసరత్తు చేస్తున్నారు. కూటమికి తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉంది. వైసీపీ నుంచి మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

కూటమికి చిగురిస్తున్న ఆశలు

చింతపల్లి ఎంపీపీ పీఠం కోసం కసరత్తు

కూటమికి ఇద్దరు సభ్యులు మద్దతిస్తున్నట్టు ప్రచారం

మైదాన ప్రాంతాల్లో వైసీపీ ఎంపీటీసీలు బస

చింతపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి):

మండలంలో 20 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉన్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీకి చెందిన పది మంది ఎంపీటీసీ సభ్యులు విజయం సాధించారు. టీడీపీ ఎంపీటీసీ సభ్యులు నలుగురు, జనసేన ముగ్గురు, స్వతంత్రులు ముగ్గురు గెలుపొందారు. చింతపల్లి ఎంపీటీసీ పీఠం దక్కించుకునేందుకు 11 మంది మద్దతు అవసరం. ఎంపీపీ పీఠం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో చౌడుపల్లి వైసీపీ రెబల్‌ ఎంపీటీసీ సభ్యుడు మామిడి గోవింద్‌ మద్దతును వైసీపీ నాయకులు తీసుకున్నారు. తనకు వైస్‌ ఎంపీపీ పదవి ఇవ్వాలని మామిడి గోవింద్‌ డిమాండ్‌ చేస్తున్నాడు. వైసీపీ అధిష్ఠానం వైస్‌ ఎంపీపీ పదవిని చింతపల్లి-2 ఎంపీటీసీ సభ్యురాలు దాసరి ధారలక్ష్మీపద్మకు కేటాయించాలని భావిస్తున్నారు. వైసీపీ ఎంపీటీసీ సభ్యులు పది మంది, చౌడుపల్లి స్వతంత్ర అభ్యర్థి గోవింద్‌ని సైతం చేజారిపోకుండా ఉండేందుకు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పర్యవేక్షణలో మైదాన ప్రాంతంలో బస ఏర్పాటుచేశారు. ఇక కూటమి విషయానికొస్తే.. చింతపల్లి-3 ఎంపీటీసీ సభ్యురాలు కిముడు పార్వతిని ఎంపీపీ చేయాలని జనసేన నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే 9 మంది మద్దతు ఉంది. మరో ఇద్దరు ఎంపీటీసీ సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపఽథ్యంలో జనసేన నాయకులు వైసీపీకి చెందిన ఇద్దరు సభ్యుల మద్దతు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ఎంపీపీ అభ్యర్థి పార్వతికి మద్దతిచ్చేందుకు ఇద్దరు వైసీపీ ఎంపీటీసీ సభ్యులు అంగీకరించినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా తాజాగా గొందిపాకలు ఎంపీటీసీ సభ్యురాలు పొటుకూరి దేవిని ఎంపీపీని చేయాలని వైసీపీ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎంపీపీ పీఠం ఎవరి దక్కుతుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Updated Date - Nov 14 , 2026 | 10:36 PM