Share News

రౌడీ షీటర్‌ దారుణ హత్య

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:46 AM

ఐదు హత్యలు సహా పలు కేసుల్లో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్‌ అయిన మండలంలోని జంపెన గ్రామానికి చెందిన పెచ్చెట్టి ఉపేంద్ర (25) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై కింతలి వైపు వెళుతుండగా గాదిరాయి- వమ్మలి గ్రామాల మధ్య మలుపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీతో ఉపేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

రౌడీ షీటర్‌ దారుణ హత్య
పెచ్చెట్టి ఉపేంద్ర (ఫైల్‌ ఫొటో)

గాదిరాయి- వమ్మలి మధ్య గుర్తు తెలియని వ్యక్తులు దాడి

ఇనుపరాడ్లతో తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి

ఐదు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు

మాడుగుల రూరల్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఐదు హత్యలు సహా పలు కేసుల్లో ప్రధాన నిందితుడు, రౌడీషీటర్‌ అయిన మండలంలోని జంపెన గ్రామానికి చెందిన పెచ్చెట్టి ఉపేంద్ర (25) గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై కింతలి వైపు వెళుతుండగా గాదిరాయి- వమ్మలి గ్రామాల మధ్య మలుపు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి, ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీతో ఉపేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

హత్యలు, చోరీలు వంటి కేసుల్లో నిందితుడిగా వున్న పెచ్చెట్టి ఉపేంద్ర.. ఇటీవల విజయనగరం జిల్లా బొద్దాంలో జరిగిన ఒక చోరీ కేసులో పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఈ నెల 24 తేదీన బెయిల్‌పై బయటకు వచ్చాడు. అదే రోజు విజయవాడ బయలుదేరి వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకుని 26వ తేదీ ఉదయం గ్రామానికి వచ్చాడు. గురువారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి ఒక్కడే బైక్‌పై కింతలి వైపు బయలుదేరి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత మండలం గాదిరాయి- వమ్మలి గ్రామాల మధ్య రోడ్డు పక్కన రక్తపు మడుగులో ఓ వ్యక్తి పడి ఉండడాన్ని అటుగా వెళుతున్న వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ నారాయణరావు వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే అతను మృతిచెందినట్టు గుర్తించి, జంపెన గ్రామానికి చెందిన పెచ్చెట్టి ఉపేంద్రగా నిర్ధారించారు. వెంటనే అతని తల్లిదండ్రులు అప్పారావు, సత్యవతిలకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, కె.కోటపాడు సీఐ కృష్ణ వచ్చి పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీంని రప్పించారు. సంఘటనా స్థలంలో కీప్యాడ్‌ సెల్‌ఫోన్‌, మంకీ క్యాప్‌, ఫోన్‌ ఛార్జర్‌, చెప్పులు, స్టీల్‌ రాడ్‌, ఐరన్‌ రాడ్‌ తదితర వస్తువులను క్లూస్‌టీం సేకరించింది. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రావణి తెలిపారు. మృతదేహానికి చోడవరంలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఐదు హత్య కేసుల్లో నిందితుడు

ఇదిలావుండగా హతుడు పెచ్చెట్టి ఉపేంద్రకు సంబంధించి సీఐ కృష్ణ పలు విషయాలు వెల్లడించారు. ఇతను జులాయిగా తిరుగుతూ డబ్బుకోసం ఎంతకైనా తెగించేవాడు. గత ఐదు సంవత్సరాల్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఐదు హత్య కేసుల్లో ఏకైక నిందితుడిగా వున్నాడు. 2021లో స్వగ్రామానికి చెందిన తాటికొండ స్వామి, 2023లో కోన రవి హత్య కేసుల్లో ఇతను ప్రధాన నిందితుడు. 2024లో మాకవరపాలెం మునగపాక మండలాల్లో ముగ్గురు వ్యక్తుల హత్యల్లో (ఒక వలంటీరు, ఇద్దరు ఫార్మాసిటీ ఉద్యోగులు) కూడా ఇతనిపై కేసులు నమోదై వున్నాయి. ఆయా కేసుల్లో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, కొద్ది రోజుల తరువాత బెయిలుపై బయటకు వస్తుండేవాడు.

Updated Date - Feb 28 , 2026 | 12:46 AM