అరకు రిసార్ట్స్ వద్ద యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:46 AM
అరకులోయలోని ‘రూపా’ రిసార్టు వద్ద ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అరకులోయ నుంచి లోతేరు వెళ్లే రహదారిలో హట్టగుడ గ్రామ సమీపాన ఉన్న ఈ రిసార్టు వద్ద మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
- హట్టగుడ గ్రామ సమీపాన ఘటన
- రిసార్టులో పని చేసే ముగ్గురు యువకులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు బంధువుల ఆరోపణ
- నిందితుల కోసం పోలీసుల గాలింపు
అరకులోయ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): అరకులోయలోని ‘రూపా’ రిసార్టు వద్ద ఒక యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అరకులోయ నుంచి లోతేరు వెళ్లే రహదారిలో హట్టగుడ గ్రామ సమీపాన ఉన్న ఈ రిసార్టు వద్ద మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్నివలస గ్రామానికి చెందిన నాగెళ్ల సురేశ్ (25) హైదరాబాద్‌లోని ఒక జ్యువెలరీ షాపులో పనిచేస్తున్నాడు. అతనికి వివాహం కాగా, అతని భార్య ప్రస్తుతం గర్భవతి. సురేశ్ గతంలో పద్మాపురంలోని ఒక రిసార్టులో కొన్నాళ్లు పనిచేశాడు. ఆ సమయంలో అతనికి అదే రిసార్టులో పనిచేస్తున్న మహిళతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఇక్కడ పనిచేస్తూ హైదరాబాద్ వెళ్లాడు. ఇటీవల స్వగ్రామమైన జన్నివలసలో ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చాడు. విజయనగరం వెళుతున్నట్టు ఇంట్లో చెప్పి అరకులోయ చేరుకుని, గతంలో పరిచయం ఉన్న మహిళతో కలిసి మంగళవారం ఉదయం 10 గంటలకు రూపా రిసార్టులో రూమ్ తీసుకున్నాడు. వారిద్దరూ గదిలో ఉండగా రూపా రిసార్టులో పని చేస్తున్న ముగ్గురు యువకులు ఇబ్బంది పెట్టారు. సురేశ్‌తో వాళ్లు గొడవకు దిగారు. దీంతో రూమ్ ఖాళీ చేసి రాత్రి పది గంటలకు మహిళతో పాటు సురేశ్ బయటకు రాగా, ఆ యువకులు వెంటపడ్డారు. వారి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. ఆ యువకులు కత్తితో సురేశ్‌ను పొడిచి హెల్మెట్‌తో తలపై తీవ్రంగా కొట్టారు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సురేశ్‌తో ఉన్న మహిళ భయాందోళనకు గురై అక్కడి నుంచి పారిపోయింది. సమాచారం అందడంతో సురేశ్ బంధువులు బుధవారం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం స్థానిక ఎస్‌ఐ గోపాలరావుతో కలిసి పాడేరు డీఎస్పీ అభిషేక్ సంఘటన స్థలానికి చేరుకుని సురేశ్ మృతదేహాన్ని పరిశీలించారు. రిసార్టు యజమానిని, సిబ్బందిని విచారణ జరిపారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.