దారుణ హత్య
ABN , Publish Date - Aug 16 , 2026 | 12:46 AM
వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న ఆక్రోశంతో శనివారం ఉదయం భర్త పీకకోసి హతమార్చిన భార్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
- భర్త పీక కోసి హతమార్చిన భార్య
- వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఘాతుకం
- నిందితురాలు అంగన్‌వాడీ కార్యకర్త
చోడవరం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడన్న ఆక్రోశంతో శనివారం ఉదయం భర్త పీకకోసి హతమార్చిన భార్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పట్టణ శివారు అన్నవరం రామ్మోహనరావు పేటలోని అంబేడ్కర్ నగర్‌లో కొండల వెంకటరావు(58) స్థానికంగా కేబుల్ ఆపరేటర్‌గా పనిచే స్తున్నారు. ఆయనకు భార్య ఇందిర, నలుగురు కుమార్తెలు ఉన్నారు. భార్య ఇందిర స్థానికంగా అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నది. పెళ్లీడుకు వచ్చిన నలుగురు కుమార్తెలు ఉన్నప్పటికీ, వెంకటరావు వేరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న విషయంలో భార్యాభర్తల మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలంటూ భార్య ఇందిర పలుమార్లు భర్తను బతిమిలాడుతున్నట్టు స్థానికంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వెంకటరావు, ఇందిరలు శనివారం ఉదయం అనకాపల్లిలోని తమ కుమార్తె ఇంటి నుంచి 9 గంటల సమయంలో ఇంటికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇందిర కత్తితో భర్త పీక కోసి హతమార్చింది. భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నట్టు సమాచారం తెలిసిన వెంకటరావు సోదరి వరలక్ష్మి అక్కడికి వచ్చింది. తన సోదరుడు వెంకటరావు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి నిశ్చేష్టురాలైంది. తానే భర్తను హతమార్చినట్టు ఇందిర చెప్పడంతో వరలక్ష్మి వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని హత్యాస్థలంలో ఆధారాలను సేకరించారు. అనంతరం స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితురాలు ఇందిరను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఈ హత్యపై సీఐ బి.అప్పలరాజు మాట్లాడుతూ భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న అనుమానంతో అతనిని ఇందిర హత్య చేసినట్టు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని సీజ్ చేశామని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు.