మూడు రోజుల వ్యవధిలో అన్నదమ్ముల ఆత్మహత్య
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:26 AM
వాళ్లిద్దరు అన్నదమ్ములు. ఇద్దరి మధ్య మూడేళ్ల వయసు తేడా. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు అప్పుల బాధతో ఐదు రోజుల క్రితం తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడి, మరుసటి రోజు మృతిచెందాడు. తోబుట్టువు మరణాన్ని తట్టుకోలేక అన్న కూడా రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తొలుత తమ్ముడు బలవన్మరణం
మనస్తాపంతో అన్న..
రమణయ్యపేటలో విషాదం
నక్కపల్లి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): వాళ్లిద్దరు అన్నదమ్ములు. ఇద్దరి మధ్య మూడేళ్ల వయసు తేడా. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు అప్పుల బాధతో ఐదు రోజుల క్రితం తమ్ముడు ఆత్మహత్యకు పాల్పడి, మరుసటి రోజు మృతిచెందాడు. తోబుట్టువు మరణాన్ని తట్టుకోలేక అన్న కూడా రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నాలుగు రోజుల వ్యవధిలో తమ్ముడు, అన్న ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందడంతో వీరిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు దిక్కులేనివారయ్యారు. మండలంలోని రమణయ్యపేట గ్రామంలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
రమణయ్యపేటకు చెందిన కర్రి నరేంద్ర (40), కర్రి కృష్ణార్జున కుమార్ (37) అన్నదమ్ములు. కృష్ణార్జున కుమార్ నక్కపల్లిలో ‘టీ టైమ్’ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అప్పుల బాధతో ఈ నెల 16వ తేదీన పొలాల్లో గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగాడు. కుటుంబ సభ్యులు కాకినాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతిచెందాడు. ఇతనికి ఇంకా వివాహం కాలేదు. కాగా కృష్ణార్జున కుమార్ అన్న సురేంద్ర వ్యవసాయ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తమ్ముడు మృతిచెందిన నాటి నుంచి ముభావంగా వుంటున్నాడు. తీవ్రమనస్తాపంతో 19వ తేదీ ఆదివారం ఇతను కూడా గడ్డి నివారణ మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే తునిలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా వుండడంతో అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం మృతిచెందాడు. నరేంద్రకు తల్లిదండ్రులు చెల్లారావు, సత్యవతితోపాటు భార్య దేవి, ఇద్దరు చిన్నపిల్లలు వున్నారు. అన్నదమ్ములు ఒకరి తరువాత మరొకరు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ మురళీ చెప్పారు.