Share News

పారిశ్రామిక వాడల్లో దళారుల దందా!

ABN , Publish Date - May 11 , 2026 | 12:47 AM

పరిశ్రమ నిర్మాణం మొదలైన నాటి నుంచి ఉత్పత్తి పారంభం అయ్యే వరకు ఆయా యాజమాన్యాలను రాజకీయ నేతల ముసుగులో దళారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. భూమి చదును, గ్రావెల్‌/ మట్టి సరఫరా, మెటీరియల్‌ రవాణా, శ్రామికుల సరఫరా, ట్రాన్స్‌పోర్టు, తదితర వాటికి సంబంధించి ఆయా కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటవుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి వారి ఆగడాల వద్ద యాజమాన్యాలు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి.

పారిశ్రామిక వాడల్లో దళారుల దందా!
అచ్యుతాపురంలో ఏపీ సెజ్‌ కార్యాలయం

వివిధ రకాల కాంట్రాక్టులు, కంపెనీల్లో ఉద్యోగాల కోసం యాజమాన్యాలపై ఒత్తిళ్లు

అధికారంలో ఉన్న పార్టీల నాయకుల అండదండలు

ఇబ్బంది పడుతున్న పారిశ్రామికవేత్తలు

ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా కానరాని స్పందన

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

పరిశ్రమ నిర్మాణం మొదలైన నాటి నుంచి ఉత్పత్తి పారంభం అయ్యే వరకు ఆయా యాజమాన్యాలను రాజకీయ నేతల ముసుగులో దళారులు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. భూమి చదును, గ్రావెల్‌/ మట్టి సరఫరా, మెటీరియల్‌ రవాణా, శ్రామికుల సరఫరా, ట్రాన్స్‌పోర్టు, తదితర వాటికి సంబంధించి ఆయా కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి కాంట్రాక్టులు దక్కించుకుంటున్నారు. జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటవుతున్న ప్రస్తుత తరుణంలో ఇటువంటి వారి ఆగడాల వద్ద యాజమాన్యాలు ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి.

అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో వివిధ రకాల పరిశ్రమలు 120కిపైగా వరకు ఉన్నాయి. ఇందులో 85 వరకు ఫార్మా కంపెనీలే ఉన్నాయి. మరో ఎనిమిది ఫార్మా కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిన నాటి నుంచి అందులో ఉత్పత్తి ప్రారంభం అయ్యేవరకు కార్మికులు, వాహనాలు, భవన నిర్మాణ సామగ్రి, వివిధ రకాల వస్తువులు అవసరం అవుతాయి. సహజంగా యాజమాన్యాలు సముచిత ధరకు సరఫరా చేసే వారిని ఎంచుకుంటారు. కానీ అచ్యుతాపురం, పరవాడ పారిశ్రామిక ప్రాంతాల్లో కొంతమంది రాజకీయ నాయకులు (ఏ పార్టీ అధికారంలో వుంటే వారు..) దళారులు అవతారం ఎత్తుతున్నారు. అన్ని పనులు తమకే అప్పగించాలని, తాము నిర్ధారించిన ధర చెల్లించాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించడం చాలా కాలం నుంచి సాగుతున్నది. కంపెనీల యాజమాన్యాలను బెదిరించి చిన్నపాటి నిర్మాణ పనులు, కూలీల సరఫరా, సిబ్బంది రవాణా, మెటీరియల్‌ సరఫరా వంటి వాటి టెండర్లను బలవంతంగా చేజిక్కించుకుంటున్నారు. అధికార పార్టీలకు చెందిన నాయకులు కావడంతో పనులకు ఆటంకం కలగకుండా వుండేందుకు పలు కంపెనీల యాజమాన్యాలు తలొగ్గాల్సి వస్తున్నది. అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ మండలాల్లో పలువురు నాయకులు తమ పరిధిలోని కంపెనీలు, పరిశ్రమలను నిరంతర ఆదాయ వనరులుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవుట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు, క్లాస్‌-4 కాంట్రాక్టు సంస్థలను, ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీలను బినామీలు, కటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మరోవైపు ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగ యువత నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. పర్మనెంట్‌ ఉద్యోగం అని చెప్పి, భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని, చివరకు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల్లో చేరుస్తున్నారు. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు ఫార్మా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులను రోజూ విశాఖపట్నం, గాజువాక, తదితర ప్రాంతాల నుంచి తీసుకువచ్చేందుకు, విధులు ముగిసిన తరువాత తిరిగి తీసుకెళ్లేందుకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టును చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో లేనప్పటికీ అతనికి చెందిన ట్రావెల్స్‌ కంపెనీ నుంచి ఇప్పటికీ సుమారు 50 బస్సులు నడుస్తున్నాయి. ఈ కాంట్రాక్టు వచ్చే నెలతో ముగియనుండడంతో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టును చేజిక్కించుకునేందుకు కూటమిలో ఒక పార్టీకి చెందిన నాయకుడు పైరవీలు మొదలుపెట్టినట్టు తెలిసింది. ఇదే పార్టీకి చెందిన మరో నేత.. ఎక్కడ కొత్త కంపెనీ ఏర్పాటవుతుంటే అక్కడ వాలిపోయి నేల చదును, ఎత్తు చేసే పనుల కాంట్రాక్టులను చేజిక్కించుకుంటున్నారు.

కొత్త పరిశ్రమ ఏర్పాటుకు కేటాయించిన భూమిలో తుప్పలు, చెట్లు తొలగించి, సరహద్దులను నిర్ణయించి ఇచ్చే బాధ్యత ఏపీఐఐసీ అధికారులదే. ఈ పనులను టెండర్‌ ప్రక్రియ ద్వారా చేయిస్తుంటారు. అయితే ఆయా పనులు తమకే దక్కేలా చూడాలని అధికారులను బెదిరించే పరిస్థితి ఏర్పడింది. పైగా ఎక్కువ రేటుకు కోట్‌ చేస్తున్నారు. ఇటీవల అచ్యుతాపురం సెజ్‌లో ఒక ప్రముఖ కంపెనీ ప్రహరీ గోడ నిర్మాణ పనుకు టెండర్లు పిలవగా.. స్థానిక నాయకుడు ఒకరు అధిక రేటుకు టెండరు వేసి, ఆ పని తనకే ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. సివిల్‌ పనులను బలవంతంగా చేజిక్కించుకుంటున్న నాయకులు.. వాటిని స్వయంగా చేపట్టకుండా.. ఇతరులకు సబ్‌కాంట్రాక్టులు ఇచ్చి, పర్సంటేజీలు తీసుకుంటున్నారు. పెట్టుబడి, శ్రమ, రిస్క్‌ లేకుండా డబ్బులు సంపాదిస్తున్నారు.

పరవాడ మండలంలో ప్రభుత్వ రంగంలోని ఒక ప్లాంట్‌లో ఉత్పత్తి అనంతరం భారీఎత్తున ఫ్లై యాష్‌ (బూడిద) వస్తుంది. దీని విక్రయం కాంట్రాక్టును గతంలో వైసీపీ నేతలు దక్కించుకొని లక్షలాది రూపాయలు సంపాదించారు. ఇప్పుడు కూటమి అధికారంలో వుండడంతో మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాలకు చెందిన ఇద్దరు నాయకులు ఈ కాంట్రాక్టును దక్కించుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు, ఫాల్జీ బ్రిక్స్‌ తయారీ యూనిట్లకు రోజూ వందలాది లారీల్లో ఫ్లైయాష్‌ను తరలిస్తూ బాగానే ఆర్జిస్తున్నారు.

ఫిర్యాదు చేసినా స్పందన లేదు

ఫార్మా కంపెనీల్లో దళారులు, మధ్యవర్తుల దూకుడు తగ్గించాలని కొన్ని యాజమాన్యాలు ఇటీవల ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. స్థానిక నేతలు గతంలో (వైసీపీ హయాంలో) మాదిరిగానే తమపై ఒత్తిళ్లు తేవడం వల్ల తాము ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదని యాజమాన్యాలు వాపోతున్నాయి.

Updated Date - May 11 , 2026 | 12:47 AM