విరగ్గాసిన వాటర్ యాపిల్
ABN , Publish Date - Apr 25 , 2026 | 10:58 PM
మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరంలో ఓ గిరిజన యువ రైతు పెరట్లో వాటర్ యాపిల్ మొక్కలు విరగ్గాశాయి. దీంతో వాటర్ యాపిల్స్‌ని కొనుగోలు చేసేందుకు ప్రాంతీయులు, మైదాన ప్రాంత ప్రజలు క్యూ కడుతున్నారు.
కొనుగోలు చేసేందుకు యర్రవరానికి క్యూ కడుతున్న ప్రాంతీయులు
మెండైన పోషక విలువలు కలిగిన పండ్లుగా చెబుతున్న శాస్త్రవేత్తలు
చింతపల్లి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొందిపాకలు పంచాయతీ యర్రవరంలో ఓ గిరిజన యువ రైతు పెరట్లో వాటర్ యాపిల్ మొక్కలు విరగ్గాశాయి. దీంతో వాటర్ యాపిల్స్‌ని కొనుగోలు చేసేందుకు ప్రాంతీయులు, మైదాన ప్రాంత ప్రజలు క్యూ కడుతున్నారు. వాటర్ యాపిల్స్ తీసుకోవడం వల్ల మెండైన పోషక విలువలు లభిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గిరిజన ప్రాంత వాతావరణం, నేలలు వాటర్ యాపిల్ సాగుకు అత్యంత అనుకూలమని 20 ఏళ్ల క్రితం చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో యర్రవరం గ్రామానికి చెందిన యువ రైతు గూడేపు వేణుగోపాల్ రాజు ఆరేళ్ల క్రితం కడియం నుంచి తీసుకొచ్చిన మూడు వాటర్ యాపిల్స్ మొక్కలను పెరట్లో నాటాడు. వాటర్ యాపిల్ మొక్కలు గత ఏడాది నుంచి దిగుబడులనిస్తున్నాయి. ప్రస్తుతం సీజన్ కావడంతో ప్రతి కొమ్మలోనూ గుత్తులుగా పండ్లు కాశాయి. అత్యధికంగా దిగుబడులు రావడంతో ఉద్యానశాఖ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి, నర్సీపట్నం ప్రాంత ప్రజలు వాటర్ యాపిల్స్‌ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటర్ యాపిల్స్‌ని కిలో రూ.50కు రైతు విక్రయిస్తున్నాడు. ఈ పండ్లు తినడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుందని, రోగనిరోధకశక్తి పెంచడంతోపాటు గుండె ఆరోగ్యం మెరుగు పరుస్తుందని హరిపురం కేవీకే గృహవిజ్ఞాన శాస్త్రవేత్త సింగపల్లి మీనాక్షి తెలిపారు. విటమిన్-సీ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయని, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని ఆమె తెలిపారు.