Share News

విరగ్గాసిన మిరియాలు

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:16 PM

మన్యంలో ఈ ఏడాది మిరియాలు విరగ్గాశాయి. కాఫీ తోటల్లో సిల్వర్‌ ఓక్‌ చెట్లకున్న పాదాలకు గుత్తులుగా మిరియాలు దర్శనమిస్తున్నాయి. వర్షాలు అనుకూలించడంతో పంట ఆశాజనకంగా ఉందని రైతులు సంబరపడుతున్నారు.

విరగ్గాసిన మిరియాలు
పాదులకు గుత్తులుగా ఉన్న మిరియాలు

ఆశాజనకంగా పంట

ఫిబ్రవరి నెలాఖరు నుంచి కోతలు

మార్చి, ఏప్రిల్‌లో సంతల్లో క్రయవిక్రయాలు

ఏజెన్సీలో 70 వేల ఎకరాల కాఫీ తోటల్లో మిరియాల పాదులు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ఏజెన్సీలోని కాఫీ తోటల్లో నీడ కోసం పెంచుతున్న సిల్వర్‌ ఓక్‌ చెట్లకు అల్లుకుని మిరియాల పాదులున్నాయి. మన్యంలో 2.72 లక్షల ఎకరాల్లో కాఫీ తోటలుంటే.. వాటిలో 70 వేల ఎకరాల్లో మాత్రమే మిరియాలు సాగు చేస్తున్నారు. కాఫీ రైతుల ఆసక్తి మేరకు తమ తోటల్లో మిరియాల పాదులు పెడతారు. ఒక్కో చెట్టుకు అల్లుకున్న పాదు ద్వారా ఏడాదికి 25 నుంచి 30 కిలోల పచ్చి మిరియాలు దిగుబడి వస్తుంది. దీంతో కాఫీ రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు సైతం మిరియాల రైతులకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు రాయితీపై వలిచే యంత్రాలు, ప్లాస్టిక్‌ టార్పలిన్లు అందిస్తున్నది. దీంతో మిరియాల పంటపై గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు.

ఫిబ్రవరి నెలాఖరు నుంచి మిరియాల కోతలు

మిరియాల పంటను రైతులు ఫిబ్రవరి నెలాఖరు నుంచి కోస్తారు. కోసిన వాటిని ఎండబెట్టి, శుద్ధి చేసి మార్చి నెల నుంచి వారపు సంతల్లో విక్రయిస్తారు. నెలన్నర పైబడి ఏజెన్సీ వారపు సంతల్లో, గ్రామాల్లో మిరియాలు క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. అలాగే మిరియాలకు సైతం నిత్యం డిమాండ్‌ ఉండడంతో ధర దిగజారే పరిస్థితి లేదనే ధీమా వర్తకులు, రైతులు వ్యక్తంచేస్తున్నారు. గతేడాది మార్కెట్‌ సీజన్‌ ప్రారంభంలో కిలో ధర రూ.450 కాగా.. సీజన్‌ ముగిసే నాటికి రూ.590 వరకు పెరిగింది. దీంతో కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలు పండించే గిరిజన రైతులకు అదనపు ఆదాయాన్ని మిరియాలు సమకూరుస్తున్నాయి.

Updated Date - Jan 24 , 2026 | 11:16 PM