Share News

మూన్నాళ్లకే ఛిద్రం

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:48 AM

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) లేఅవుట్లలో చేపట్టిన తారు రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూ.కోట్ల ప్రజాధనంతో చేపట్టే పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. దీంతో మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి.

 మూన్నాళ్లకే ఛిద్రం
కుంచంగి వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌లో కుంగిపోయిన తారు రోడ్డు మూన్నాళ్లకే ఛిద్రం

వీఎంఆర్‌డీఏ లేఅవుట్‌లలో నాసిరకంగా తారు రోడ్ల పనులు

కుంచంగి, వేటజంగాలపాలెంలో రూ.3.3 కోట్లు ఖర్చు

కొద్ది రోజులకే బయటపడిన నాణ్యతాలోపాలు

అధికారుల పర్యవేక్షణ లోపంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం

సమగ్ర విచారణ జరపాలని స్థానికుల డిమాండ్‌

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) లేఅవుట్లలో చేపట్టిన తారు రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యతాలోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రూ.కోట్ల ప్రజాధనంతో చేపట్టే పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. దీంతో మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ నగరంలోని పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అనకాపల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు 800 ఎకరాలను ‘ల్యాండ్‌ పూలింగ్‌’ పేరుతో సేకరించారు. భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో ఎకరాకు 18 సెంట్లు చొప్పున ప్లాట్లు కేటాయించారు. అనకాపల్లి మండలం సంపతిపురంలో 3, కోడూరులో 2, కుంచంగి, వేటజంగాలపాలెంలో ఒక్కో లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ లేవుట్‌లలో రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కోసం వీఎంఆర్‌డీఏ నుంచి రూ.12.3 కోట్లు కేటాయించారు. రెండున్నరేళ్ల క్రితం సార్వత్రిక ఎన్నికల ముందు టెండర్‌ ప్రక్రియ పూర్తిచేశారు. తరువాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పనులు మొదలుపెట్టలేదు.

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అవే పనులకు 2025 మార్చిలో టెండర్లు పిలిచారు. తక్కువకు కోట్‌ చేసిన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. కానీ వీఎంఆర్‌డీఏ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పనుల పర్యవేక్షణను గాలికొదిలేశారు. కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి, నాసిరకంగా పనులు చేశారు. కుంచంగి, వేటజంగాలపాలెం లేఅవుట్‌లలో అంతర్గత తారు రోడ్ల నిర్మాణ పనులు గత ఏడాది డిసెంబరులో పూర్తయ్యాయి. ఈ రెండు గ్రామాల పరిధిలోని లేఅవుట్‌లలో తారు రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.3.3 కోట్లు ఖర్చు చేశారు. ఏడాది తిరగకుండానే రోడ్ల నాణ్యతలో డొల్లతనం బయట పడింది. నాసిరకం పనులపై స్థానికులు ఫిర్యాదు చేయడం, మీడియాలో కథనాలు రావడంతో వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్‌ అధికారులు రోడ్లు దెబ్బతిన్నచోట ఆదరాబాదరాగా ప్యాచ్‌వర్కులు చేయించి చేతులు దులుపుకున్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై ఎటువంటి చర్యలు చేపట్టలేదు.

వర్షాలతో మళ్లీ దెబ్బతిన్న రోడ్లు

కుంచంగి, వేటజంగాలపాలెం లేఅవుట్‌లలో ఇంతవరకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. గత నెల చివరి వారంలో కురిసిన వర్షాలతో పలుచోట్ల రోడ్లు మళ్లీ దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల రోడ్డు కుంగిపోయింది. భారీ వాహనాల రాకపోకలు లేకపోయినప్పటికీ తారు పెచ్చులు లేచిపోయాయి. లేఅవుట్‌లలో జరిగిన రోడ్ల నిర్మాణంలో నాణ్యతాలోపాలపై వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని భూములు ఇచ్చిన రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 14 , 2026 | 12:48 AM