Share News

అటు చకచకా.. ఇటు నత్తనడక..

ABN , Publish Date - Apr 13 , 2026 | 01:17 AM

వేపగుంట- పినగాడి మధ్య రహదారి విస్తరణ పనులు ఒకవైపు చకచకా జరుగుతుండగా, మరోవైపు నత్తనడకన సాగుతున్నాయి.

అటు చకచకా.. ఇటు నత్తనడక..

వేపగుంట- పినగాడి మధ్య రహదారి విస్తరణ పరిస్థితి

జీవీఎంపీ పరిధిలో ముందుకు సాగని పనులు

రోడ్డుకు ఇరువైపులా గోతుతీసి వదిలేసిన వైనం

నాలుగు కల్వర్టుల్లో ఒక్కటి కూడా మొదలుకాని నిర్మాణం

మరోవైపు వీఎంఆర్‌డీఏ పరిధిలో శరవేగంగా పనులు

ఆరు కల్వర్టుల్లో ఐదింటి నిర్మాణం పూర్తి

తారు రోడ్డు వేయడమే మిగిలి ఉంది

విశాఖపట్నం/పెందుర్తిరూరల్‌, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి):

వేపగుంట- పినగాడి మధ్య రహదారి విస్తరణ పనులు ఒకవైపు చకచకా జరుగుతుండగా, మరోవైపు నత్తనడకన సాగుతున్నాయి. ఈ రహదారిని రెండు భాగాలుగా విభజించి జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ పనులు చేట్టాయి. వేపగుంట నుంచి లక్ష్మీపురం రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి వరకు జీవీఎంసీ చేపట్టిన పనులు చాలా మందకొడిగా సాగుతున్నాయి. అక్కడి నుంచి పినగాడి వరకు వీఎంఆర్‌డీఏ చేపట్టిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

వేపగుంట- పినగాడ మధ్య రోడ్డు అధ్వాన్నంగా మారడం, ట్రాఫిక్‌ పెరగడంతో చాలా ఏళ్ల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దగోతులు ఏర్పడి రాళ్లు తేలడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్నది. దీంతో భోగాపురం ఎయిర్‌పోర్టు కనెక్టవిటీ రోడ్లను శరవేగంతో విస్తరించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. వీటిల్లో వేపగుంట- పినగాడి రహదారి ఒకటి. వేపగుంట జంక్షన్‌ నుంచి పినగాడి జంక్షన్‌ వరకు ఆరు కిలోమీటర్ల రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలన్నది ప్రణాళిక. వేపగుంట నుంచి లక్ష్మీపురం రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి (చేపల మార్కెట్‌)వరకు జీవీఎంసీ పరిధి కావడంతో విస్తరణ పనులు జీవీఎంసీ చేపట్టాలని నిర్ణయించారు. అక్కడ నుంచి పినగాడి వరకు గ్రామ పంచాయతీల పరిధి కావడం వల్ల విస్తరణ పనులు వీఎంఆర్‌డీఎ చేపట్టాలని ప్రతిపాదించారు. మొత్తం ఆరు కిలోమీటర్ల దూరంలో జీవీఎంసీ, వీఎంఆర్‌డీలు చెరో మూడు కి.మీ. దూరం పనులు చేపట్టాయి. మొత్తం వ్యయం రూ.10 కోట్లు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విశాఖ నగరం నుంచి అనకాపల్లి జిల్లా మాడుగుల, చోడవరం నియోజకవర్గాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు, చుట్టుపక్కల మండలాలకు వెళ్లే ప్రయాణికులతోపాటు గాజువాక, గోపాలపట్నం, వేపగుంట ప్రాంతాల వారు భోగాపురం ఎయిర్‌పోర్టుకు సులువుగా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది.

తొలుత జీవీఎంసీ పరిధిలో వేపగుంట జంక్షన్‌ నుంచి ఆరు నెలల క్రితం విస్తరణ పనులు చేపట్టారు. ఇందుకోసం రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలగించారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపులా మట్టి తవ్వారు. ఒక వైపు ఐదు అడుగుల వెడుల్పున పునాది గొయ్యి మాదిరిగా తవ్వేసి అక్కడక్కడ నల్లపిక్క, క్రషర్‌ బుగ్గితో అసంపూర్తిగా పూడ్చి వదిలేశారు. దీనివల్ల చీకటిపడిన తర్వాత ఈమార్గంలో ప్రయాణించే వారు ప్రమాదాలకు గురవుతున్నారు. వాహన చోదకులు గోతుల్లో పడిపొతున్నారు. ఈ మార్గంలో నాలుగు చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి వుంది. కనీసం ఒక్క కల్వర్టు నిర్మాణానికి కూడా ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు.

ఇదిలావుండగా లక్ష్మీపురం రైలు కమ్‌ రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి నుంచి పినగాడి కూడలి వరకు వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు చకచకా సాగుతున్నాయి. ఆరు కల్వర్టులకుగాను ఇప్పటికే ఐదు కల్వర్టుల నిర్మాణం పూర్తయ్యింది. పినగాడి సమీపం వరకు విస్తరణ భాగమంతా నల్లపిక్క, క్రషర్‌ బుగ్గి వేసి వాటరింగ్‌ పనులు చేస్తున్నారు. మేహాద్రిగెడ్డ బ్రిడ్జి వద్ద ఎత్తు పెంచిన రహదారికి ఇరువైపులా కాంక్రీటు గోడ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తారు రోడ్డు వేయడమే మిగిలి ఉంది.

Updated Date - Apr 13 , 2026 | 01:17 AM