Share News

డ్రాగన్‌ ఫ్రూట్‌ విక్రయాల జోరు

ABN , Publish Date - Aug 18 , 2026 | 12:28 AM

మన్యంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివాసీలు డ్రాగన్‌ ఫ్రూట్‌ను సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్నారు. సీజన్‌ కావడంతో ఒక్కసారిగా అధిక దిగుబడులు మార్కెట్‌కి వస్తున్నాయి.

డ్రాగన్‌ ఫ్రూట్‌ విక్రయాల జోరు
చింతపల్లి మార్కెట్‌లో విక్రయిస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్స్‌

సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న గిరిజనులు

సీజన్‌ కావడంతో మార్కెట్‌లో విరివిగా లభ్యం

చింతపల్లి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మన్యంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివాసీలు డ్రాగన్‌ ఫ్రూట్‌ను సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్నారు. సీజన్‌ కావడంతో ఒక్కసారిగా అధిక దిగుబడులు మార్కెట్‌కి వస్తున్నాయి. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుతో గిరిజన రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. అరుదైన ఉద్యాన పంటల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ ఒకటి. 2008లో తొలిసారిగా చింతపల్లి మండలం జల్లూరుమొట్ట గ్రామంలో తెనాలికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయ్‌ శ్రీరామ్‌ డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించారు. నాటి నుంచి గిరిజన ప్రాంతంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు విస్తరించింది. ఈ పంట సాగుకు గిరిజన ప్రాంతం వాతావరణం అనుకూలించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా సాగును ప్రోత్సహిస్తున్నది. పాడేరు రెవెన్యూ డివిజన్‌లో అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, జీకేవీధి, చింతపల్లి మండలాల్లో గిరిజన రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు చేస్తున్నారు. చింతపల్లి, జీకేవీధి మండలాల్లో లంబసింగి, చిట్రాళ్లగొప్పు, గొందిపాకలు, పెదబరడ, చిన్నబరడ, దేవరాపల్లి, పెదవలస గ్రామాల్లో గిరిజనులు సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ మొక్కల నుంచి అధిక దిగుబడులు వచ్చాయి. ఒక్కొక్క మొక్క నుంచి 35-45 పండ్లు వస్తున్నాయి. పింక్‌, వైట్‌ రకాలను గిరిజన రైతులు సాగు చేస్తున్నారు. గిరిజన రైతులు డ్రాగన్‌ ఫ్రూట్‌ దిగుబడులను చింతపల్లి, చిట్రాళ్లగొప్పు, లంబసింగి మార్కెట్‌కి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ ఒక పండు రూ.30- 40కు, కిలో రూ.170- 200ధరకు విక్రయిస్తున్నారు. కొంత మంది గిరిజన రైతులు మైదాన ప్రాంతాలకు తీసుకు వెళ్లి పండ్లను విక్రయిస్తున్నారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు.

Updated Date - Aug 18 , 2026 | 12:28 AM