జోరుగా పైనాపిల్ విక్రయాలు
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:18 AM
మన్యంలో ప్రస్తుతం పైనాపిల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో వాటి క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా సుమారుగా 600 ఎకరాల్లో పైనాపిల్ తోటల పెంపకాన్ని గిరిజన రైతులు చేపడుతున్నారు.
ఒక్కో కాయ రూ.25 చొప్పున రిటైల్‌గా అమ్మకం
టోకుగా వర్తకులకు రూ.18 చొప్పున విక్రయం
సాగు విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడితే రైతులకు ఎంతో మేలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో ప్రస్తుతం పైనాపిల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి మండలాల్లో వాటి క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. ఏజెన్సీ వ్యాప్తంగా సుమారుగా 600 ఎకరాల్లో పైనాపిల్ తోటల పెంపకాన్ని గిరిజన రైతులు చేపడుతున్నారు.
జిల్లా కేంద్రం పాడేరు మండలం వంట్లమామిడి, సలుగు, దేవాపురం, ఐనాడ పంచాయతీల పరిధిలో పదుల సంఖ్యలో గిరిజన రైతులు వాటి పెంపకం చేపడుతున్నారు. వాటిని స్థానికంగా గ్రామాల్లో, వారపు సంతల్లో విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. మైదాన ప్రాంతానికి చెందిన వర్తకులు సైతం ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి రైతుల నుంచి వాటిని కొనుగోలు చేసుకుని చోడవరం, అనకాపల్లి, విశాఖపట్నం, నర్సీపట్నం, తుని ప్రాంతాల్లోని మార్కెట్‌లలో విక్రయిస్తున్నారు. ప్రస్తుతం హోల్‌సేల్ ధర రూ.18, రిటైల్ ధర రూ.25 చొప్పున పైనాపిల్ విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే ఏజెన్సీలో ప్రకృతి సేద్య పద్ధతిలో వాటి పెంపకం చేపడుతుండడంతో ఇతర ప్రాంతాల్లో వాటికి మంచి డిమాండ్ ఉంది.
సాగు విస్తరణతోనే రైతులకు మేలు
ఏజెన్సీలో వందల ఎకరాల్లో పైనాపిల్ తోటల పెంపకాన్ని గిరిజన రైతులు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రోత్సాహం లేకుండా పోయింది. వాస్తవానికి పంట సాగు విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపడితే రైతులకు చాలా వరకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో రైతులు తమకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పైనాపిల్ తోటల పెంపకాన్ని చేపడుతున్నారు. మార్కెటింగ్ పరంగా ఎటువంటి తోడ్పాటు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతల్లోని వర్తకులకు విక్రయించడం, మిగిలిన వాటిని రోడ్ల పక్కన దుకాణాలు పెట్టుకుని పర్యాటకులు, ప్రయాణికులకు అమ్మకాలు చేస్తున్నామని రైతులు తెలిపారు. కాగా ఏజెన్సీలో గిరిజన రైతులు పెద్ద ఎత్తున పైనాపిల్ తోటలను పెంచుతున్నప్పటికీ వాటిని అనుబంధంగా ప్రోసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తామని అధికారులు చేసే ప్రకటనలు చాలా కాలంగా కార్యరూపం దాల్చడం లేదు. ఏజెన్సీలో పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో వాటి ఆధారిత ప్రోసెసింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తే గిరిజన రైతులకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు ధర సైతం దిగజారకుండా రైతులకు మేలు జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు అటువంటి చర్యలు చేపట్టకపోవడంతో వాటిని రోడ్లపై విక్రయించుకోవడం మినహా తాము ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని గిరిజన పైనాపిల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.