గిరిజనుల ముంగిటకు ఆరోగ్య సేవలు
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:52 AM
జిల్లాలోని మారుమూల గిరిజనుల ముంగిటకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మండలంలో గన్నెలలో శనివారం ఆయన సంజీవని ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో 150 వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఉందని, వైద్య సేవలు మీ ముంగిటకు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలకు రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ప్రాస్ట్రక్టర్ కంప్లీషన్ మిషన్‌ను తీసుకువస్తామన్నారు.
పేదరిక నిర్మూలనకు ప్రత్యేక చర్యలు
కాఫీ, మిరియాలు, ప్రకృతి సాగు,
టూరిజం ద్వారా గిరిజనుల ఆదాయం పెంపు
పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
సీఎం నారా చంద్రబాబునాయుడు
గన్నెల పీహెచ్‌సీ పరిధిలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభం
అరకులోయ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలోని మారుమూల గిరిజనుల ముంగిటకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. మండలంలో గన్నెలలో శనివారం ఆయన సంజీవని ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. జిల్లాలో 150 వాహనాలతో ఎమర్జెన్సీ లైఫ్‌లైన్ నెట్‌వర్క్ ఉందని, వైద్య సేవలు మీ ముంగిటకు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలకు రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్‌ప్రాస్ట్రక్టర్ కంప్లీషన్ మిషన్‌ను తీసుకువస్తామన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అడవితల్లి బాట పేరిట రూ.వెయ్యి కోట్లతో 900 కిలోమీటర్ల తారురోడ్లు వేశామని, ఇంటింటికీ కొళాయిల ద్వారా తాగునీరు అందిస్తామని, సోలార్ రూప్‌టాప్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగేలా కాఫీని మరో లక్ష ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అరకు, లంబసింగి, పాడేరు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసి, హోమ్ స్టేల ద్వారా గిరిజన ఆథిత్యాన్ని అందించి ఆదాయాన్ని పెంచుతామన్నారు. మన ప్రాంతానికి వచ్చే పరిశ్రమల ఆధారంగా గిరిజన యువతకు ఉద్యోగాలు వచ్చేలా, ఉపాధి కలిగేలా నైపుణ్యాభివృద్ధి కల్నిస్తామన్నారు. వచ్చే మూడేళ్లలో లక్ష మందికి ఉపాధి కల్పించేలా నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు.
భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి పేరు
గిరిజనులకు అల్లూరి సీతారామరాజు ఆయుర్వేద వైద్యం అందించారని, అటువంటి మహనీయుడ్ని నిత్యం స్మరించుకుంటూ కొత్తగా నిర్మించిన భోగాపురం విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ధింసా డాన్సులతో గిరిజన బిడ్డలు గిన్నిస్ రికార్డు సైతం సృష్టించారని అభినందించారు. ఏజెన్సీలో సెల్ కనెక్టవిటీని పెంచేందుకు మరిన్ని టవర్లను నిర్మిస్తామని, కొండల్లో జీవనం సాగిస్తున్న వారికి సైతం సెల్‌ఫోన్ల సాయంతో వైద్యం, ఇతర సదుపాయాలు అందేలా చర్యలు చేపడతామన్నారు.
జనాభా నిర్వహణలో గిరిజనులు ముందంజ
జనాభా నిర్వహణ(పాపులేషన్ మేనేజ్‌మెంట్)లోనూ గిరిజనులు ముందంజలో ఉన్నారని, ఇది అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పిల్లలు మన సంపదనే సిద్థాంతాన్ని గిరిజనులు ఆచరిస్తున్నారని, ఇది గర్వకారణమన్నారు. గతంలో ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు అని నేనే అన్నానని, కాని ప్రపంచంలో అనేక దేశాల్లో పాపులేషన్ మేనేజ్‌మెంట్ దెబ్బతినడంతో యువత శాతం తగ్గిపోతున్నదని, అది ప్రమాదమన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం అధిక సంఖ్యలో పిల్లల్ని కనేందుకు ఆసక్తి చూపాలన్నారు. గత పాలకులు గంజాయిని వాణిజ్య పంటగా చేసి ఏజెన్సీ ప్రాంతానికి చెడ్డ పేరు తీసుకువస్తే, తమ ప్రభుత్వం గంజాయిని నిర్మూలించి, కాఫీ, మిరియాలు, ప్రత్యామ్నాయ పంటలతో గిరిజనులకు ఆదాయంతోపాటు ఏజెన్సీకి ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తున్నామన్నారు. తాము పెత్తందారులం కాదని, ప్రజలకు సేవలకులమని, గిరిజన ప్రాంతాన్ని ఊహించని అభివృద్ధి చేస్తామని చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, ఆర్‌టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ సియ్యారి దన్నుదొర, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, టీడీపీ అరకు జిల్లా అధ్యక్షురాలు తేజోవతి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, అధికారులు పాల్గొన్నారు.
జీవో-3కి ప్రత్యామ్నాయం జీవో తెస్తా..
గత పాలకుల హయాంలో రద్దయిన జీవో-3కి ప్రత్యామ్నాయ జీవో తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. గత పాలకులు జీవో-3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే సరైన రీతిలో తమ వాదనలు వినిపించలేదన్నారు. ఫలితంగా జీవో-3 రద్దయిందన్నారు. 2000లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో-3 ద్వారా రెండు దశాబ్దాలుగా గిరిజనులకు వేల సంఖ్యలో టీచర్ పోస్టులు దక్కాయన్నారు. అయినా గిరిజనులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏజెన్సీలో ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా జీవో-3కి ప్రత్యామ్నాయాన్ని తీసుకువస్తామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. గిరిజన బిడ్డలు అత్యుత్తమ విద్యాసంస్థల్లో చదవాలనే లక్ష్యంతోనే ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం చేసుకున్నామని, వారికి ఐఐటీ, నీట్ పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కోచింగ్‌లను అందిస్తామన్నారు. గిరిజన ఉత్పత్తులకు ప్రంపంచ స్థాయి బ్రాండ్ సృష్టించాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని, అరకు కాఫీని ప్రమోట్ చేశామని ఆయన గుర్తు చేశారు.