ఉత్సాహంగా బ్రిక్స్ సమావేశాలు
ABN , Publish Date - Aug 23 , 2026 | 01:10 AM
నగరంలో బ్రిక్స్ దేశాల క్రీడా, యువజన మంత్రుల సమావేశాలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.
తొట్లకొండలో మొక్కలు నాటిన ప్రతినిధులు
అనంతరం రాడిసిన్‌బ్లూ హోటల్‌లో యువజన మంత్రుల సమావేశం
నోవాటెల్ హోటల్‌లో గాలా డిన్నర్
హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు
నేడు క్రీడా మంత్రుల భేటీ
విశాఖపట్నం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి):
నగరంలో బ్రిక్స్ దేశాల క్రీడా, యువజన మంత్రుల సమావేశాలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం తొట్లకొండపై సభ్య దేశాల ప్రతినిధులు ‘తల్లి పేరుతో ఒక మొక్క’ నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటారు. కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ, ఇతర బ్రిక్స్ దేశాల మంత్రులు, ఉన్నతాధికారులు చిరుజల్లులతో ఏర్పడిన ఆహ్లాదకర వాతావరణంలో ఫొటోలు దిగారు. అక్కడ నుంచి మనోహరంగా కనిపించే సముద్రాన్ని తిలకించారు. తరువాత రాడిసిన్‌బ్లూ హోటల్‌లో యువజన మంత్రుల సమావేశం నిర్వహించారు. అభివృద్ధిలో యువత సహకారం, భాగస్వామ్యం మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు. ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, వికసిత్ భారత్ లక్ష్యం 2047 నాటికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువ నాయకులను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని, ఆ స్ఫూర్తితో ‘మై భారత్’ పేరుతో ఒక వేదిక ఏర్పాటు చేశామన్నారు. బ్రిక్స్ దేశాల మంత్రులు, ప్రతినిధులకు శనివారం రాత్రి నోవాటెల్ హోటల్‌లో గాలా డిన్నర్ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించే నృత్యరూపకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎం.రాంప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాండవీయ, సహాయమంత్రి రక్షానిఖిల్ ఖడ్సేలకు సీఎం జ్ఞాపికలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు. ఆదివారం బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరగనుంది. దీనిలో భాగంగా ఉదయం బీచ్‌రోడ్‌లో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తారు. బ్రిక్స్ దేశాల మంత్రులు, ఉన్నతాధికారుల రాక నేపథ్యంలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు.