ధింసా నృత్యానికి ఊపిరి
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:49 PM
మండలంలోని తాజంగి గిరిజన మహిళలు ధింసా నృత్యానికి ఊపిరిపోస్తున్నారు.
పర్యాటక ప్రాంతాల్లో కళాకారుల ప్రదర్శన
సందర్శకులకు వినోదం
ఆదివాసీ మహిళలకు ఉపాధి
చింతపల్లి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తాజంగి గిరిజన మహిళలు ధింసా నృత్యానికి ఊపిరిపోస్తున్నారు. అధికారిక కార్యక్రమాలు, విందు, వినోద కార్యక్రమాల్లో మాత్రమే అరుదుగా ప్రదర్శించే ధింసా నృత్యాన్ని గిరిజన మహిళలు లంబసింగిలో ప్రతి రోజు సందర్శకుల వినోదం కోసం ప్రదర్శిస్తున్నారు. సందర్శకులు ధింసా నృత్యంతో వినోదం పొందుతుండగా, ఆదివాసీ మహిళలు ఉపాధి పొందుతున్నారు. పూర్వం చింతపల్లి పరిధిలోని తాజంగి గిరిజన మహిళలు ధింసా నృత్యాన్ని జాతీయ స్థాయిలో పలుమార్లు ప్రదర్శించారు. ఈ నృత్యానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. కాలక్రమేణా ఆ కళాకారులు వృద్ధులు కావడం, మరికొంత మంది మృతి చెందడం వల్ల ధింసా నృత్యం చేసే కళాకారులు కనుమరుగయ్యారు. అయితే ప్రస్తుతం గిరిజన మహిళలు పర్యాటకాన్ని అందిపుచ్చుకుని ధింసా నృత్యానికి జీవం పోస్తున్నారు. తాజంగి గిరిజన మహిళలు, యువతులు చెరువులవేనం ముఖద్వారం భీమనాపల్లి వద్ద ప్రతి రోజు ఉదయం వేళల్లో ధింసా ప్రదర్శన ఇస్తున్నారు. సందర్శకులు ఈ నృత్యాన్ని తిలకించడంతో పాటు ఆ కళాకారులతో కలిసి నృత్యం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ధింసా నృత్యాన్ని తిలకించేందుకు ఒక్కొక్కరి నుంచి కళాకారులు రూ.50 చొప్పున తీసుకుంటున్నారు. ప్రస్తుతం పర్యాటకులు ధింసా నృత్యాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.