Share News

కేజీహెచ్‌లో తల్లిపాల బ్యాంకు

ABN , Publish Date - Jul 27 , 2026 | 01:07 AM

కేజీహెచ్‌లో తల్లి పాల బ్యాంకు ఏర్పాటుకానున్నది. ఇందుకోసం సీమాంక్‌ భవనంలో పనులు సాగుతున్నాయి.

కేజీహెచ్‌లో తల్లిపాల బ్యాంకు

అంకోసా, సుషేణ హెల్త్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు

రూ.2.3 కోట్ల వ్యయం

ధాత్రి మదర్స్‌ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకుగా నామకరణం

స్వచ్ఛందంగా ముందుకువచ్చే వారి నుంచి సేకరణ

అవసరమైన వారికి అందజేసేలా చర్యలు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

కేజీహెచ్‌లో తల్లి పాల బ్యాంకు ఏర్పాటుకానున్నది. ఇందుకోసం సీమాంక్‌ భవనంలో పనులు సాగుతున్నాయి. శిశువు ఆరోగ్య సంరక్షణలో తల్లిపాలే కీలకం. రకరకాల కారణాల వల్ల ఎంతోమంది తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటువంటి తల్లు లకు ఉపశమనం కలిగించేలా, చిన్నారులకు సాంత్వన చేకూర్చేలా కేజీహెచ్‌లో తల్లిపాల బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆంధ్ర మెడికల్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (అంకోసా), సుషేణ హెల్త్‌ ఫౌండేషన్‌ భాగస్వామ్యంతో ‘ధాత్రి మదర్స్‌ హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంకు’ పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.2.3 కోట్లు వెచ్చిస్తున్నారు. సుమారు రూ.30 లక్షల వరకు అంకోసా అందిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని సుషేణ హెల్త్‌ ఫౌండేషన్‌ ఇస్తోంది.

పుట్టిన వెంటనే తల్లి పాలను ఇవ్వడం వల్ల నవజాత శిశువులు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా నెలలు నిండక ముందే పుట్టినవారికి, తక్కువ బరువుతో జన్మించిన వారికి, అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు తల్లిపాలు ఎంతో అవసరం. ఈ పాలతో రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు ప్రమాదకరమైన ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవ్వలేని పరిస్థితి

కొన్ని కారణాల వల్ల కొంతమంది తల్లులు బిడ్డకు పాలివ్వలేని పరిస్థితి ఎదుర్కొంటారు. ప్రసవం తరువాత కొందరు తల్లులకు వెంటనే పాలు రావు. ఆరోగ్య సమస్య లతో పాలివ్వలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి తల్లుల పిల్లలకు ఆరోగ్యవంతమైన మహిళల నుంచి సేకరించిన పాలను అందించనున్నారు. స్వచ్ఛందంగా పాలు అందిం చేందుకు వచ్చే వారి నుంచి సేకరించి, శాస్ర్తీయ పద్ధతిలో శుద్ధిచేసి అవసరమైన నవజాత శిశువులకు అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేక గదిని తీర్చిదిద్దుతున్నారు. పాలను శుద్ధి చేసే అత్యాధునిక పరికరాలు, దీర్ఘకాల నిల్వ కోసం డీప్‌ ఫ్రీజర్లు, తల్లులకు అవగాహన కల్పించేందుకు వీలుగా కౌన్సెలింగ్‌ కేంద్రం, ప్రత్యేక ఆర్‌వో వాటర్‌ ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు.

రెండు నెలల్లో అందుబాటులోకి...

తల్లిపాల బ్యాంకును రెండు నెలల్లో అందుబాటులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి తెలిపారు. కేజీహెచ్‌లో ఏటా వందలాది మంది ప్రసవం కోసం చేరుతుంటారని, వారిలో కొంత మంది చిన్నారులకు పాలివ్వలేని పరిస్థితులుంటాయని, వారికి ఈ బ్యాంకుతో మేలు చేకూరుతుందన్నారు.


కేజీహెచ్‌లో కొనసాగిన విచారణ

ఫార్మసీ విభాగంలో రికార్డులను పరిశీలించిన అధికారులు

ఆక్సిజన్‌ సరఫరా తీరు పరిశీలన.. లీకేజీలు గుర్తింపు

విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కేజీహెచ్‌లో ఆక్సిజన్‌ వ్యవహారంపై ఆదివారం కూడా విచారణ కొనసాగింది. కమిటీ సభ్యులు జాయింట్‌ డైరెక్టర్‌ రత్నాల గణపతి, ఇతర సభ్యులు కొందరు ఉద్యోగులతో ఎథిక్స్‌ గ్యాలరీలో వివరాలు సేకరించారు. అనంతరం ఫార్మసీ విభాగానికి వెళ్లి కీలక రికార్డులను పరిశీలించారు. క్యాజువాల్టీ, ఇతర విభాగాల్లో ఆక్సిజన్‌ సరఫరా తీరును పరిశీలించారు. లీకేజీలు ఉన్నట్టు గుర్తించారు. ఆక్సిజన్‌ సరఫరా అయినప్పటి నుంచి వార్డులకు సరఫరా అయ్యే వరకు పర్యవేక్షిస్తున్న టెక్నీషియన్స్‌, సిబ్బందితో మాట్లాడి కీలక విషయాలను రాబట్టినట్టు తెలిసింది. ఆయా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఏడాది కాలంగా ఆక్సిజన్‌ సరఫరా సంస్థకు చెల్లించిన బిల్లులు, హెచ్చు, తగ్గులకు కారణాలపైనా సిబ్బందిని ప్రశ్నించారు. సోమవారం కూడా అధికారులు విచారణ కొనసాగుతుందని సమాచారం. ఈ వ్యవహారంలో కీలకంగా మారిన సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ యు.శ్రీహరి సోమవారం విచారణకు హాజరై వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు. ఇతను కొన్ని నెలలుగా ఎందుకు సెలవులో ఉంటున్నారని కమిటీ సభ్యులు ఆరా తీసినట్టు తెలిసింది. ఆస్పత్రిలో నెలకొన్న ఆధిపత్య పోరులో భాగంగానే ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయా.? అనే కోణంలోనూ సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. ఒక అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశారని సిబ్బంది కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. విచారణకు కారణమైన ఫిర్యాదుదారులు ఎవరో కమిటీ సభ్యులు గుర్తించారా.? లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఫిర్యాదుదారులను విచారణకు పిలిపించి వారి వద్ద సమాచారాన్ని తీసుకుంటే ప్రక్రియ వేగంగా సాగుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఆదివారం నిర్వహించిన విచారణకు అడిషనల్‌ డైరక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణమూర్తి, విజయనగరం మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దేవి మాధవి గైర్హాజరయ్యారు.


నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

మహారాణిపేట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఈనెల 28న జరిగే సింహాచలం గిరిప్రదక్షిణ నేపథ్యంలో కలెక్టరేట్‌, జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, పోలీస్‌ కమిషనరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేసినట్టు కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, ఆయా శాఖల అధికారులు తెలిపారు. గిరిప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం శాఖల పరంగా ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన బాధ్యతల్లో యంత్రాంగం నిమగ్నమై ఉందని, ఈ నేపథ్యంలో పీజీఆర్‌ఎస్‌ను రద్దుచేస్తున్నామని, ప్రజలు ఈవిషయాన్ని గుర్తించాలని కోరారు.

Updated Date - Jul 27 , 2026 | 01:07 AM