Share News

జల విద్యుత్‌ కేంద్రంలో రెండవ నంబర్‌ యూనిట్‌ బ్రేక్‌డౌన్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:04 PM

సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో 2వ నంబర్‌ యూనిట్‌కు సాంకేతిక లోపాలు తలెత్తడంతో యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

జల విద్యుత్‌ కేంద్రంలో రెండవ నంబర్‌ యూనిట్‌ బ్రేక్‌డౌన్‌
సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో సాంకేతిక లోపాలు తలెత్తి నిలిచిపోయిన 2వ నంబర్‌ యూనిట్‌

సాంకేతిక లోపంతో నిలిచిపోయిన విద్యుదుత్పత్తి

సీలేరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో 2వ నంబర్‌ యూనిట్‌కు సాంకేతిక లోపాలు తలెత్తడంతో యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో 60 మెగావాట్ల సామర్థ్యం గల 4 యూనిట్లు ఉన్నాయి. జల విద్యుత్‌ కేంద్రంలో మూడవ నంబర్‌ యూనిట్‌ నిర్వహణ పనుల కోసం 40 రోజుల క్రితమే విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. అలాగే శనివారం రాత్రి రెండవ నంబర్‌ యూనిట్‌ను విద్యుదుత్పత్తి చేసే క్రమంలో స్పిన్నింగ్‌లో పెట్టి లోడ్‌ వేశారు. లోడ్‌ వేసిన వెంటనే యూనిట్‌లో పెద్ద శబ్దాలు రావడంతో ఈ యూనిట్‌ ద్వారా విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. దీనిపై జలవిద్యుత్‌ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా, విద్యుదుత్పత్తి ప్రారంభించే సమయంలో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని, దీనిలో లోపాలను పరిశీలించాలని అభిరామి ఇంజనీరింగ్‌ కంపెనీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. మూడవ నంబర్‌ యూనిట్‌ మూడు, నాలుగు రోజుల్లో వినియోగంలోకి వస్తుందన్నారు. గత నెలలో జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో మూడవ నంబర్‌ యూనిట్‌ నిర్వహణ పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పుడు సీలేరు జల విద్యుత్‌ కేంద్రంలో ఒకటవ నంబర్‌ యూనిట్‌, నాల్గవ నంబర్‌ యూనిట్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా ఉండడంతో సీలేరులో రోజుకు 1.5 మిలియన్‌ యూనిట్ల నుంచి 1.8 మిలియన్‌ యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి జరుగుతున్నదని ఆయన తెలిపారు.

Updated Date - Oct 04 , 2026 | 11:04 PM