మద్యం వ్యాపారుల బరితెగింపు
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:56 AM
జిల్లాలో కొందరు మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు. గత నెల 30వ తేదీతో దుకాణం లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ, తిరిగి రెన్యువల్ చేసుకోకుండా యథావిధిగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. రెండు, మూడు దుకాణాలు ఉన్న వ్యాపారులు ఇతర దుకాణాల నుంచి మద్యం తెచ్చి తమ దుకాణంలో అమ్మకాలు జరుపుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తూ వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దుకాణాల లైసెన్స్ రెన్యువల్‌కు గత నెల 30 వరకూ గడువు
జిల్లాలో రెన్యువల్ కానివి 51...
అయినప్పటికీ అందులో 35కిపైగా దుకాణాల్లో
యథావిధిగా మద్యం విక్రయాలు
ఇతర దుకాణాల నుంచి సరుకు
పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కొందరు మద్యం వ్యాపారులు బరితెగిస్తున్నారు. గత నెల 30వ తేదీతో దుకాణం లైసెన్స్ గడువు ముగిసినప్పటికీ, తిరిగి రెన్యువల్ చేసుకోకుండా యథావిధిగా విక్రయాలు కొనసాగిస్తున్నారు. రెండు, మూడు దుకాణాలు ఉన్న వ్యాపారులు ఇతర దుకాణాల నుంచి మద్యం తెచ్చి తమ దుకాణంలో అమ్మకాలు జరుపుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు చోద్యం చూస్తూ వ్యాపారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లా పరిధిలో 158 మద్యం దుకాణాలకు 2024 సెప్టెంబరులో ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండేళ్ల కాలపరిమితితో లైసెన్స్ జారీచేసింది. ఆ గడువు గత నెల 30వ తేదీతో ముగియడంతో తిరిగి ఏడాదిపాటు లైసెన్స్‌ను రెన్యువల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగర పరిధిలో రూ.35 లక్షలు చొప్పున ఫీజు చెల్లిస్తే ఏడాదిపాటు లైసెన్స్ రెన్యువల్ చేయాలని ఎక్సైజ్‌శాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలోని 107 దుకాణాల యజమానులు లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు ముందుకువచ్చారు. మిగిలిన 51 దుకాణాల వ్యాపారులు లైసెన్స్‌లను రెన్యువల్ చేసుకోలేదు. దీంతో ఆయా దుకాణాలు సెప్టెంబరు 30తో అధికారికంగా మూతపడ్డాయి. ఆయా దుకాణాలకు ఐడీ ఉండదు కాబట్టి ఎక్సైజ్ డిపోల నుంచి మద్యం విడిపించునేందుకు వీలుండదు. లైసెన్స్ ఫీజు కట్టనందున ప్రస్తుతం అవన్నీ మూతపడి ఉండాలి. మూతపడిన దుకాణాలను కొత్తవారికి కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ ప్రకటన ఇచ్చింది. దరఖాస్తు ఫీజు కింద రూ.మూడు లక్షలు చెల్లించాలని సూచించింది. ఒక్కో దుకాణానికి కనీసం నాలుగు దరఖాస్తులు వస్తే లాటరీ ద్వారా కేటాయించాలని నిర్ణయించింది.
మూతపడిన దుకాణాల్లో యథావిధిగా విక్రయాలు
గత నెల 30 నాటికి రూ.35 లక్షలు చెల్లించి లైసెన్స్ రెన్యువల్ చేసుకోని దుకాణాలన్నీ అక్టోబరు ఒకటి నుంచి అధికారికంగా మూతపడాలి. వాటిని కొత్తవ్యాపారులకు కేటాయించి, లైసెన్స్ జారీచేసేంత వరకు వాటిల్లో మద్యం విక్రయాలు జరపడానికి వీల్లేదు. కానీ మూతపడిన 51 దుకాణాల్లో సుమారు 35 దుకాణాల్లో యథావిధిగా విక్రయాలు జరిగిపోతున్నాయి. లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా వదిలేసిన దుకాణాల యజమానుల్లో కొందరికి రెండు, మూడు దుకాణాలు ఉండడంతో వాటి ఐడీలతో డిపోల నుంచి సరుకు విడుదల చేసి, మూతపడినట్టు రికార్డుల్లో చూపించిన దుకాణాల్లో విక్రయాలు జరుపుతూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు ఎందుచేతనోగానీ ఆ పనిచేయడం లేదు.