ఆక్రమణదారులపై అవ్యాజ ప్రేమ
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:58 AM
: పంచాయతీ అధికారుల తీరు కారణంగా పాయకరావుపేట మెయిన్‌రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా వున్న చిన్నాచితకా దుకాణాలను తొలగించిన అధికారులు, ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన పక్కా నిర్మాణాలను తొలగించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనివల్ల డ్రైనేజీ కాలువలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. ఆయా భవనాలు, ఇతర కట్టడాలను ఎక్కడ వరకు తొలగించాలో అధికారులు మార్కింగ్ చేసి నెలలు గడుస్తున్నా.. వాటి తొలగింపుపై దృష్టిపెట్టడంలేదు. దీంతో ఆక్రమణలు తొలగించరన్న ధీమా వారిలో పెరుగుతున్నది.
‘పేట మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కట్టడాలను తొలగించని పంచాయతీ అధికారులు
డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంలో తీవ్ర జాప్యం
పాయకరావుపేట, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ అధికారుల తీరు కారణంగా పాయకరావుపేట మెయిన్‌రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రోడ్డు విస్తరణ కోసం ఇరువైపులా వున్న చిన్నాచితకా దుకాణాలను తొలగించిన అధికారులు, ఆర్‌అండ్‌బీ స్థలాన్ని ఆక్రమించి చేపట్టిన పక్కా నిర్మాణాలను తొలగించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీనివల్ల డ్రైనేజీ కాలువలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. ఆయా భవనాలు, ఇతర కట్టడాలను ఎక్కడ వరకు తొలగించాలో అధికారులు మార్కింగ్ చేసి నెలలు గడుస్తున్నా.. వాటి తొలగింపుపై దృష్టిపెట్టడంలేదు. దీంతో ఆక్రమణలు తొలగించరన్న ధీమా వారిలో పెరుగుతున్నది.
పాయకరావుపేట ఎమ్మెల్యే, హోం మంత్రి వంగలపూడి అనిత కృషి ఫలితంగా పాయకరావుపేట మెయిన్‌రోడ్డు విస్తరణకు వీఎంఆర్‌డీఏ రూ.5.25 కోట్లు విడుదల చేసింది. మంత్రి వినతి మేరకు తాండవ వంతెన నుంచి వై జంక్షన్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా ఆర్‌అండ్‌బీ స్థలంలో ఉన్న బడ్డీలు, ఇతర నిర్మాణాలను పలువురు స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. మిగిలిన వాటిని అధికారులు దగ్గరుండి తొలగించారు. అనంతరం ఈ ఏడాది మార్చిలో రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న బీటీ రోడ్డుకి ఇరువైపులా నాలుగున్నర మీటర్ల మేర వెడల్పు చేసే పనులుచేపట్టారు. తొలుత సమారు అడుగు లోతున మట్టి తవ్వేసి, అందులో మెటల్‌పరిచి చదును చేశారు. దీనిపై బీటీ లేయర్ వేసే సమయానికి పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తారు ధర టన్ను రూ.47 వేల నుంచి ఏకంగా రూ.95 వేలకు చేరడంతో తారు వేసే పనులు ఆగిపోయాయి.
కాగా మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలు, ఫుట్ పాత్‌లు, సెంట్రల్ లైటింగ్ కోసం వీఎంఆర్‌డీఏ ఇటీవల రూ.5 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న సుమారు 30 విద్యుత్ స్తంభాలను పక్కకు జరిపే పనులను విద్యుత్ శాఖ చేపట్టింది. డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం కోసం సర్వే చేసిన అధికారులు రోడ్డుకు ఇరువైపులా పలుచోట్ల మార్కింగ్ చేశారు. వీటిలో కొన్ని పక్కా నిర్మాణాలు వున్నాయి. పంచాయతీ అధికారులు వీటిని తొలగిస్తే.. పనులు మొదలుపెడతామని వీఎంఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. కానీ పంచాయతీ అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు.
డ్రైనేజీ కాలువలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనులు మొదలుకాకపోవడంపై వీఎంఆర్‌డీఏ ఇంజనీరింగ్ విభాగం ఈఈ రాంబాబును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగించాల్సిన బాధ్యత పంచాయతీ, రెవెన్యూ శాఖలదేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. మెయిన్‌రోడ్డు ఇరువైపుల ఆక్రమణల తొలగింపుపై పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి శివరామమ్‌ను వివరణ కోరగా.. ఆక్రమణల తొలగింపు బాధ్యత పంచాయతీదేనని అయితే ఉన్నతాధికారుల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదన్నారు. ఆదేశాలు వచ్చిన తరువాత రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ అధికారుల సమక్షంలో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.