Share News

భారత్‌ గ్యాస్‌లో బాస్‌ బుకింగ్‌

ABN , Publish Date - Apr 07 , 2026 | 01:13 AM

ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీల లీలలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

భారత్‌ గ్యాస్‌లో బాస్‌ బుకింగ్‌

సిలిండర్‌ డెలివరీ కాకుండానే మెసేజ్‌లు

వినియోగదారుల గగ్గోలు

అవగాహన కల్పించని కంపెనీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీల లీలలన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. యుద్ధం వల్ల ఎల్‌పీజీ సరఫరా తగ్గడంతో వంట గ్యాస్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. గ్యాస్‌ ఏజెన్సీలు రకరకాలుగా చేసే మోసాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సిలిండర్‌ బుక్‌ చేయకున్నా చేసినట్టు, డెలివరీ చేయకుండానే చేసినట్టు మెసేజ్‌లు వస్తున్నాయి. దీనిపై నిత్యం ఏజెన్సీల వద్ద గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా భారత్‌ పెట్రోలియం కంపెనీకి చెందిన భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీల్లో ‘బాస్‌’ బుకింగ్‌ బయటపడింది. ఏ కంపెనీలో లేనివిధంగా భారత్‌ గ్యాస్‌ ‘భారత్‌ ఆధార్‌ సీడింగ్‌’ (బాస్‌) ఎనేబుల్డ్‌ గ్యాస్‌ బుకింగ్‌ చాలాకాలంగా అమలు చేస్తోంది. అంటే వినియోగదారుడు సిలిండర్‌ బుక్‌ చేసుకునే సమయాన్ని ఒక ఏడాది పాటు గమనించి, ఆ తరువాత వారు బుక్‌ చేయకున్నా ఆ సమయానికి కంపెనీయే ‘బాస్‌’ విధానంలో బుక్‌ చేసి సిలిండర్‌ డెలివరీ చేస్తుంది. అంటే కొందరు రెండు నెలలు, మరికొందరు మూడు నెలలకు ఒక సిలిండర్‌ వాడుతుంటారు. అలాంటి వారికి ఆ సమయం రాగానే ఆటోమేటిక్‌గా కంపెనీయే సిలిండర్‌ బుక్‌ చేసి ఫోన్‌కి మెసేజ్‌ పంపుతుంది. దానిని బాయ్‌ డెలివరీ చేస్తాడు. అయితే ఈ విధానం అమలులో ఉందన్న సంగతి ఏనాడూ ఆ కంపెనీ ప్రకటించలేదు. వినియోగదారులకు తెలియజేయలేదు. ఏజెన్సీలు కూడా చెప్పలేదు. వినియోగదారులు కూడా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఏజెన్సీలు అలా సర్దుబాటు చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు అదే విధానంలో బాస్‌ విధానం ద్వారా సిలిండర్లు బుక్‌ అయిపోతున్నాయి. గ్యాస్‌కు ఇబ్బందులు ఉండడంతో ఏ మెసేజ్‌ వచ్చినా వినియోగదారులు అప్రమత్తమవుతున్నారు. తాము బుక్‌ చేయకుండా చేసినట్టు, డెలివరీ చేయకుండా చేసినట్టు మెసేజ్‌లు ఎలా వస్తున్నాయంటూ కొందరు ఏజెన్సీల వద్దకు వెళ్లి నిలదీస్తున్నారు. దాంతో వివాదాలు తలెత్తుతున్నాయి.

హెచ్‌బీ కాలనీలో అదే తీరు

హెచ్‌బీ కాలనీలో భారత్‌ గ్యాస్‌ ఏజెన్సీ వద్దకు ఇలాంటి తగాదాలే వస్తున్నాయి. సోమవారం ఒక వినియోగదారుడు ఇలాగే వచ్చి ప్రశ్నించారు. తాను బుక్‌ చేయలేదని, మెసేజ్‌ ఎలా వచ్చిందని నిలదీశారు. నిర్వాహకులు తమకు సంబంధం లేదని, అది కంపెనీ బాస్‌ బుకింగ్‌ అని చెప్పారు. కావాలంటే సిలిండర్‌ ఇస్తామని తీసుకువెళ్లాలని సూచించారు. అయితే నాలుగు నెలలకు ఓసారి తాము బుక్‌ చేసుకుంటామని, ఆ సమయం రాకుండా ఇప్పుడు ఎలా బుక్‌ అయిందని అడిగితే వారు సమాధానం చెప్పలేకపోయారు.

భారత్‌ బాయ్‌ల ద్వారా హెచ్‌పీ గ్యాస్‌ డెలివరీ

డెలివరీ బాయ్‌లు అన్ని కంపెనీల గ్యాస్‌ను వారే డెలివరీ చేస్తున్నారు. వాస్తవానికి ఏ కంపెనీకి అ కంపెనీ బాయ్‌లు ఉంటారు. ఒకరికి మరొకరికి సంబంధం ఉండదు. కానీ భారత్‌ గ్యాస్‌ బాయ్‌లు హెచ్‌పీ గ్యాస్‌ సిలిండర్లను తీసుకువెళుతూ సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి కనిపించారు. దీనిపై కూడా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.

Updated Date - Apr 07 , 2026 | 01:13 AM