Share News

బంగారంపై ఆచితూచి రుణం

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:20 AM

బంగారు ఆభరణాలపై రుణాల విషయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అప్రమత్తమైంది. బహిరంగ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో రుణాలపై ప్రతి వారం సమీక్షిస్తోంది.

బంగారంపై  ఆచితూచి రుణం

ధర పతనం కావడంతో డీసీసీబీ అప్రమత్తం

మార్కెట్‌ రేటులో 65 శాతం

మాత్రమే ఇవ్వాలని నిర్ణయం

కుదవబెట్టిన బంగారం విలువ,

తీసుకున్న రుణం మదింపు చేసి పలువురికి నోటీసులు

విశాఖపట్నం, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి):

బంగారు ఆభరణాలపై రుణాల విషయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) అప్రమత్తమైంది. బహిరంగ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకూ తగ్గుతుండడంతో రుణాలపై ప్రతి వారం సమీక్షిస్తోంది.

రిజర్వు బ్యాంకు నుంచి వచ్చే సమాచారం మేరకు రెండు రోజుల క్రితం రుణ పరపతి విధానాన్ని జాతీయ స్థాయిలో ఉన్న బంగారు ఆభరణాల అమ్మకందారుల సంఘం మార్పు చేసింది. ఈనెల 23వ తేదీకి ముందు గ్రాము బంగారు ఆభరణంపై రూ.తొమ్మిది వేలు ఇస్తుండగా, ప్రస్తుతం రూ.8,500కు తగ్గించింది. డీసీసీబీ ఐదారు నెలల క్రితం గ్రాము ఆభరణంపై రూ.10 వేలు కంటే ఎక్కువ మంజూరుచేసింది. గడచిన రెండు నెలల నుంచి ధరలు మరింత పతనం కావడంతో గతంలో ఉన్న నిబంధనలు మార్చేసింది. ఆభరణాల విలువలో 70 నుంచి 75 శాతం ఇచ్చే రుణ మొత్తాన్ని 65 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది.

ఇదిలావుండగా జిల్లాలోని 32 బ్రాంచీల్లో 32 వేల మంది ఖాతాదారులకు బంగారు ఆభరణాలపై రూ.660 కోట్ల రుణాలు మంజూరుచేసింది. ఆభరణాలపై రుణం పొందిన వ్యక్తులు ఏడాదిలోగా రుణం చెల్లించి బంగారం విడిపించుకోవాలి. వడ్డీ రేటు 10.25 శాతం చెల్లించాలి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ అవసరాలకు బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులతో గడచిన ఏడాది కాలంలో బంగారు ఆభరణాలపై రుణాలు పొందిన వారందరికీ డీసీసీబీ నోటీసులు జారీచేస్తోంది. ఆభరణాల విలువ, తీసుకున్న రుణ మొత్తాన్ని మదించి, తేడా ఉంటే అందుకు సమానమైన సొమ్ము వెంటనే చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. బంగారు రుణాలపై ప్రతి వారం సమీక్షిస్తున్నామని డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి కోన తాతారావు వివరించారు. బహిరంగ మార్కెట్‌లో రేట్లను పరిశీలన చేసి ఆ మేరకు రుణ పరపతిని మార్చుకుంటామన్నారు.

Updated Date - Nov 26 , 2026 | 01:21 AM