అధ్వానంగా బొర్రా రోడ్డు
ABN , Publish Date - Jun 06 , 2026 | 10:38 PM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు వెళ్లే రోడ్డంతా పూర్తిగా పాడైంది. అయినా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పర్యాటకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడుగడునా గుంతలే
ఐదేళ్లుగా నిర్వహణ శూన్యం
గిరిజనులు, పర్యాటకులకు తిప్పలు
కన్నెత్తి చూడని ఆర్‌అండ్‌బీ శాఖా అధికారులు
అనంతగిరి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహలకు వెళ్లే రోడ్డంతా పూర్తిగా పాడైంది. అయినా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో పర్యాటకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డంతా అఽధ్వానంగా మారినప్పటికీ మరమ్మతులపై దృష్టి సారించకపోవడాన్ని పర్యాటకులు తప్పుబడుతున్నారు. వేసవి సెలవులకు బొర్రాగుహలను తిలకించేందుకు పర్యాటకులు ప్రైవేటు, సొంత వాహనాల్లో తరలివచ్చారు. ములియగుడ నుంచి మొదలుకోని బగ్మారవలస, దొరగూడ, గేటువలస, బొర్రా వరకు రోడ్డంతా ఎక్కడికక్కడ ఏర్పడిన గుంతలు కారణంగా రాకపోకలకు పర్యాటకులు నరకాన్ని అనుభవించారు. ఐదేళ్లుగా బొర్రా రోడ్డు మరమ్మతులు, నిర్వహణ లేకపోవడం రోడ్డంతా పలుచోట్ల పూర్తిగా కొట్టుకుపోయింది. మరికొన్నిచోట్ల భారీగా గుంతలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ ఆర్‌అండ్‌బీ శాఖా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా బొర్రా రోడ్డు అధ్వానంగా మారడంతో కోనాపురం, బొర్రా పంచాయతీలోని బొర్రా, పెద్దూరు, ఎగువమామిడి, జీరుగెడ్డ, నీనిమామిడి, పూలుగుడ, కొయిటిగూడ, కరాయిగుడ, చప్పాడి, కోనాపురం, అతిమాల, కితలింగి, బొండ్యగూడ, లిడ్డంగి, సారాగూడ తదితర గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధ్వానంగా ఉన్న రోడ్డుతో అవస్థలు పడుతున్నారు.
తరచూ ప్రమాదాలు
ములియగుడ నుంచి బొర్రాగుహలు వరకు ఏడు కిలోమీటర్లు ఉంటుంది. బగ్మారవలస, దొరగుడ, హోటళ్ల సమీపంలోని రోడ్డుపై గోతులు ఏర్పడ్డాయి. రైల్వేగేటు సమీపంలోని రక్షణగోడ కూలిపోవడంతో వచ్చే వాహనాలు అదుపుతప్పితే 80 అడుగుల లోయలోకి దూసుపోయే ప్రమాదం ఉంది. గతంలోని రెండు ప్రమాదాలు జరిగాయి. వ్యాన్ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. దానికి ముందు లారీ బోల్తాపడిన ఘటనలో డ్రైవర్‌కు కాలు విగిరిపోయాయి.
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ శాఖ
ములియుగుడ-బొర్రా వరకు ఉన్న రోడ్డు ఆర్‌అండ్‌బీశాఖ పరిధిలోకి వస్తుంది. నిర్వహణ లోపం కారణంగా రోడ్డంతా పాడైంది. కనీసం మరమ్మతులపై ఆర్‌అండ్‌బీ అధికారులు దృష్టి సారించడం లేదు. ఇటీవల జరిగిన ప్రమాదాలకు ప్రధాన కారణం గుంతలే అని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ శాఖ బొర్రా రోడ్డు మరమ్మతులకు చర్యలు చేపట్టాలని, పర్యాటకులు, స్థానిక గిరిజనులు కోరుతున్నారు.