Share News

నీరసం, నిస్సత్తువ

ABN , Publish Date - May 30 , 2026 | 12:47 AM

గడిచిన కొద్దిరోజుల నుంచి జిల్లాలో ఎండ తీవ్రంగా ఉంటోంది.

నీరసం, నిస్సత్తువ

రోజుల తరబడి ఎండ తీవ్రత, వడగాడ్పులు

కొనసాగుతుండడంలో అస్వస్థతకు గురవుతున్న నగరవాసులు

శరీరంలో నీటి శాతం, సోడియం, పొటాషియం తగ్గడమే కారణమంటున్న వైద్యులు

కొందరిలో జ్వరం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, తల తిరగడం వంటి లక్షణాలు

తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

చిన్నారులు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తత అవసరం

విశాఖపట్నం, మే 29 (ఆంధ్రజ్యోతి):

గడిచిన కొద్దిరోజుల నుంచి జిల్లాలో ఎండ తీవ్రంగా ఉంటోంది. వడగాడ్పులు కూడా వీస్తున్నాయి. ఎండ వల్ల శరీరం అలసటకు గురై చెమట రూపంలో నీరు, ఇంకా సోడియం, పొటాషియం వంటి లవణాలు బయటకు పోతున్నాయి. దీంతో నిస్సత్తువ, నీరసంతో పలువురు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. కొందరికి జ్వరం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా ఉంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వేడి ప్రభావంతో ఇబ్బందులు

మెదడులో హైపోథాలమస్‌ అనే చిన్న భాగం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్‌ చేయడం (టెంపరేచర్‌ కంట్రోల్‌ సెంటర్‌)లో అత్యంత కీలకంగా పనిచేస్తుంది. అయితే, ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ హైపోథాలమస్‌ తన పనిని సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితికి చేరుకుంటుంది. అటువంటప్పుడే వడదెబ్బకు గురికావడం, తీవ్రమైన నీరసం, అలసటకు గురవ్వడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా హైపోథాలమస్‌ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. దాహం సంకేతాలను ఇస్తుంది. చెమట పట్టేలా చేయడంతోపాటు హార్మోన్లను నియంత్రిస్తుంది. ముఖ్యంగా శరీరం వేడెక్కినప్పుడు చెమట పట్టేలా చేసి శరీరానికి రక్త ప్రసరణ పెంచుతుంది. అవసరమైనప్పుడు శరీరాన్ని చల్లబరచడానికి యత్నిస్తుంది. సాధారణంగా హైపోథాలమస్‌ 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తన పనిని సక్రమంగా చేస్తుంది. అంతకంటే ఎక్కువ టెంపరేచర్లు నమోదైనప్పుడు ఇబ్బందులు పడుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరగడం, నీరసం రావడం, తల తిరగడం, అధిక దాహం, శరీరం వేడిగా మారడం, గందరగోళం నెలకొనడం వంటివి కనిపిస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పలువురు తీవ్రమైన నీరసం, కళ్లు తిరగడం, విరేచనాలు వంటి ఇబ్బందులతో వైద్యుల వద్దకు వెళుతున్నారు. సాధారణంగా ఈ తరహా లక్షణాలు ఉంటే హీట్‌ స్ర్టోక్‌గా భావిస్తుంటారు. కానీ, వడదెబ్బ స్థాయి కంటే కాస్త తక్కువ లక్షణాలు ఉంటున్నట్టు చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్లి వచ్చినవాళ్లు, నీళ్లు ఆశించిన స్థాయిలో తాగకపోవడం వల్ల, దాహార్తిని తీర్చుకునేందుకు చల్లని పానీయాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ ఇబ్బందులు ఉంటాయంటున్నారు.

శరీరంలో నీరు తగ్గడంతోనే అసలు సమస్యలు

- ప్రొఫెసర్‌ ఆర్‌ విక్రమ్‌ వర్ధన్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగ వైద్య నిపుణులు

ఎండ తీవ్రత వల్ల ఎక్కువ మంది హీట్‌ క్రాంప్స్‌, హీట్‌ సింకోపి, హీట్‌ ఎగ్జాషన్‌/స్ర్టెస్‌ బారినపడుతున్నారు. వీటన్నింటికీ శరీరంలో నీటి శాతం, లవణాలు తగ్గడమే ప్రధాన కారణం. ఎండలోకి వెళ్లి రావడం, ఎండ ప్రభావానికి ఎక్కువగా లోనుకావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. చెమట వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి బ్రెయిన్‌కు రక్త సరఫరాలో వేగం తగ్గుతుంది. దీనివల్ల రోగి స్పృహ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీన్ని హీట్‌ సింకోపి అంటారు. శరీరంలోని సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి లవణాలు తగ్గడం వల్ల కండరాలు బిగుసుకుపోతుంటాయి. దీనిని హీట్‌ క్రాంప్స్‌ అంటారు. ఎక్కువ శాతం నీరు, మరింత ఎక్కువ లవణాలు తగ్గుముఖం పట్టడం వల్ల హీట్‌ ఎగ్జాషన్‌ బారినపడుతుంటారు. కాబట్టి, ఎక్కువగా శరీరానికి అవసరమైన నీటిని తాగడం, ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవన్నీ పరిధి దాటినప్పుడు వడదెబ్బకు గురై తీవ్ర ఇబ్బందులను రోగులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అప్రమత్తత అవసరం.

Updated Date - May 30 , 2026 | 12:47 AM