మ్యాక్స్ కాఫీ రైతులకు బోనస్
ABN , Publish Date - Oct 09 , 2026 | 12:45 AM
ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం(మ్యాక్స్) కాఫీ రైతులకు కిలోకి రూ.ఐదు చొప్పున బోనస్ పంపిణీ చేస్తున్నట్టు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ తెలిపారు.
- కిలోకి రూ.ఐదు చొప్పున పంపిణీ
- ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ
చింతపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ది విశాఖ చింతపల్లి గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక పరిమిత సంఘం(మ్యాక్స్) కాఫీ రైతులకు కిలోకి రూ.ఐదు చొప్పున బోనస్ పంపిణీ చేస్తున్నట్టు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ తెలిపారు. గురువారం పాడేరులో ఏపీవో వెంకటేశ్వరరావు, ఐటీడీఏ కాఫీ ప్రాజెక్టు అధికారులు, మ్యాక్స్ బోర్డు సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్లకు ఐటీడీఏ సహకారంతో మ్యాక్స్ ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఏజెన్సీ పదకొండు మండలాల్లో గిరిజన రైతులు పండించిన కాఫీ పండ్లను మ్యాక్స్ సేకరించి మార్కెటింగ్ చేస్తుందన్నారు. గిరిజన రైతులకు అంతర్జాతీయ ధరలు అందించేందుకు మ్యాక్స్ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని తెలిపారు. 2025-26 వార్షిక సంవత్సరంలో ఏజెన్సీ పదకొండు మండలాల్లో 312 మెట్రిక్ టన్నుల పండ్లను సేకరించామన్నారు. ఎకో పల్పింగ్ యూనిట్‌లో ప్రాసెసింగ్ చేసి 61 మెట్రిక్ టన్నుల పార్చిమెంట్‌ని ఉత్పత్తి చేశామన్నారు. తొలి విడతగా 12 మెట్రిక్ టన్నుల పార్చిమెంట్ కిలో రూ.547, రెండో విడతగా 13.890 మెట్రిక్ టన్నుల పార్చిమెంట్ కిలో రూ.530, ఆఖరి విడతగా కిలో రూ.482 ధరకు విక్రయించామని చెప్పారు. మార్కెట్ ప్రారంభంలో కాఫీకి గరిష్ఠ ధర లభించిందన్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలో అంతర్జాతీయ మార్కెట్‌లో కాఫీ ధరలు పడిపోయాయన్నారు. దీంతో ఆఖరి విడతలో కిలో రూ.482 ధరకు విక్రయించాల్సి వచ్చిందని తెలిపారు. మ్యాక్స్ మార్కెటింగ్ చేసిన కాఫీకి సరాసరి రూ.500 మద్దతు ధర లభించిందన్నారు. గిరిజనుల నుంచి కాఫీ పండ్లు సేకరించి తొలి విడతగా కిలోకి రూ.70 ధర చెల్లించామన్నారు. మార్కెటింగ్ అనంతరం బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో చర్చించి కిలోకి రూ.ఐదు చొప్పున బోనస్ చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. రెండు రోజుల్లో రైతులకు బోనస్ నగదు రైతుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది కాఫీ పండ్ల సేకరణ ముందుగా ప్రారంభిస్తామని, గిరిజన రైతులకు గరిష్ఠ ధరలు అందిస్తామని పీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో కాఫీ ఏడీ అయింతి కుమారి, మ్యాక్స్ చైర్మన్ జనకాని సింహాచలం, వైస్ చైర్మన్ మర్రి వెంకట్‌రావు, కోశాధికారి గోవింద్ పాల్గొన్నారు.