రోడ్లపై భోగి మంటలు నిషేధం
ABN , Publish Date - Jan 13 , 2026 | 01:46 AM
భోగి పండుగ సందర్భంగా నగరంలో రోడ్లపై మంటలు వేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయడం నిషేధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంటల వల్ల తారు కరిగి రహదారులపై గోతులు
ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయొద్దు
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
భోగి పండుగ సందర్భంగా నగరంలో రోడ్లపై మంటలు వేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలను దహనం చేయడం నిషేధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్లపై మంటలు వేయడం వల్ల వేడికి తారు కరిగిపోయి గుంతలు ఏర్పడతాయన్నారు. రోడ్లపై గుంతలు కారణంగా ప్రమాదాలు పెరుగుతాయన్నారు. అంతేకాకుండా ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను దహనం చేయడం వల్ల పర్యావరణం కలుషితమై గాలి నాణ్యత దెబ్బతింటుందన్నారు. ప్రజలంతా భోగి, సంక్రాంతి పండుగను రంగురంగుల ముగ్గులతో ప్రకృతికి హాని చేయని రీతిలో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ‘సే ...నో ఓపెన్ బర్నింగ్’ నినాదంతో రోడ్లపై మంటలు వేయకుండా నగరవాసులు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ స్పెషల్స్ కొనసాగింపు
మొత్తం 229...దూరప్రాంతాలకు 63, జోన్ పరిధిలో 166
ద్వారకా బ్‌సస్టేషన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
సంక్రాంతి ప్రయాణికుల రద్దీ సోమవారం కూడా కొనసాగింది. దీంతో అధికారులు 229 ప్రత్యేక సర్వీసులు నడిపారు. హైదరాబాద్ 8, విజయవాడ 12, తిరుపతి 2, చిత్తూరు 3, భీమవరం 6, శ్రీకాళహస్తి 3, ఒంగోలు 4, ఖమ్మం 2, రాజమండి 11, కాకినాడ 12, జోన్ పరిధిలోని శ్రీకాకుళం 40, పలాస 18, ఇచ్ఛాపురం 10, టెక్కలి 10, సోంపేట 8, మందస 5, విజయనగరం 30, సాలూరు 12, బొబ్బిలి 8, రాజాం 16, పార్వతీపురం 9 ప్రత్యేక సర్వీసులు నడిపారు.
స్త్రీశక్తి పథకం వర్తించే బస్సుల్లో 80 శాతం మహిళలే
విశాఖ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు రాకపోకలు సాగించే ఆర్డినరీ, పల్లెవెలుగు, ఆల్ర్టా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో 80 శాతం మంది మహిళలే ఉంటున్నారని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలకు వెళ్లే స్త్రీశక్తి పథకం బస్సుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు.
ఇతర బస్సుల్లో 75 శాతం పురుషులు
స్త్రీశక్తి పథకం వర్తించని డీలక్స్, ఆలా్ట్ర డీలక్స్, సూపర్ లగ్జరీ, మెట్రోలగ్జరీ, మెట్రో ఏసీ సర్వీస్‌లలో ప్రయాణికులు కిక్కిరిసినట్టు ఉంటున్నా అందులో 75 శాతం పురుషులు ఉంటున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే గరుడ, గరుడ ప్లస్, డాల్పిన్ క్రూయిజ్, నైట్‌రైడర్ వంటి సర్వీసుల్లో సీటింగ్ కెపాసిటీ ప్రకారం ప్రయాణించే వారిలో 75 శాతం మంది పురుషులు ఉంటున్నారు. సంక్రాంతి ప్రయాణికుల రద్దీ కొనసాగినన్ని రోజులూ ఈ ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేస్తామని ఆర్‌ఎం బి.అప్పలనాయుడు తెలిపారు.
ఏపీటీడీసీకి రూ.54.45 కోట్ల భూమి
ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరికీ కేటాయించకూడదని ఆదేశాలు
విశాఖపట్నం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు రూ.54.45 కోట్ల విలువైన భూమిని బదలాయిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామంలోని సర్వే నంబరు 102/2లో 7.7 ఎకరాలు, 103లో 7.3 ఎకరాలను పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి, హిల్ రిసార్ట్స్ కోసం ఇస్తున్నట్టు పేర్కొంది. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఇతరులకు ఈ భూమిని ఇవ్వకూడదని షరతులు విధించింది.