Share News

ఏసీబీ వలలో బొండాపల్లి పంచాయతీ కార్యదర్శి

ABN , Publish Date - Apr 09 , 2026 | 12:35 AM

మండలంలోని బొండాపల్లి పంచాయతీ కార్యదర్శి కండ్రేగుల లక్ష్మీనారాయణ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఏసీబీ వలలో బొండాపల్లి పంచాయతీ కార్యదర్శి
ఏసీబీకి చిక్కిన కార్యదర్శి లక్ష్మీనారాయణ

రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం

పెదబయలు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బొండాపల్లి పంచాయతీ కార్యదర్శి కండ్రేగుల లక్ష్మీనారాయణ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బొండాపల్లి పంచాయతీ బూరుగువీధి గ్రామానికి చెందిన దొర మల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కడబంగి గ్రామంలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.2,20,000తో రెండు మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణానికి దొర మల్లేశ్వరరావు కాంట్రాక్టు తీసుకున్నారు. అప్పుడు పంచాయతీ కార్యదర్శి సకాలంలో బిల్లు సమర్పించలేకపోవడంతో బిల్లు వెనక్కి వెళ్లిపోయింది. అనంతరం బిల్లును విడుదల చేయాలని సర్పంచ్‌ ఆధ్వర్యంలో పంచాయతీ తీర్మానం చేసి ఆమోదించింది. ఆర్‌డబ్ల్యూఎస్‌ మండల ఇంజనీర్‌ పనులను పరిశీలించి రూ.2,27,000గా నిర్ధారించారు. ఈ మొత్తం బిల్లును ప్రాసెస్‌ చేయాలని పంచాయతీ కార్యదర్శిని కాంట్రాక్టర్‌ కోరారు. బిల్లును ప్రాసెస్‌ చేయడానికి బిల్లులో 50 శాతం లంచంగా ఇవ్వాలని కార్యదర్శి డిమాండ్‌ చేశారు. ఆ తరువాత బిల్లును 20 శాతానికి తగ్గించారు. ఒకసారి రూ.1.3 లక్షలకు బిల్లును ప్రాసెస్‌ చేశారు. ఈ నెల 2వ తేదీన మిగిలిన రూ.97,000 బిల్లు కూడా ప్రాసెస్‌ చేయాలంటే రూ.30 వేలు లంచం ఇవ్వాలని కాంట్రాక్టర్‌ను పంచాయతీ కార్యదర్శి డిమాండ్‌ చేశారు. చేసేది లేక ఏసీబీ అధికారులకు కాంట్రాక్టర్‌ ఫిర్యాదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కార్యదర్శి తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ నగదుతో పాటు పనులకు సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో సిబ్బంది సుప్రియ, శ్రీనివాసరావు, వెంకట్రావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2026 | 12:35 AM