Share News

జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

ABN , Publish Date - Jan 09 , 2026 | 01:10 AM

విశాఖ జిల్లా కోర్టుకు గురువారం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది.

జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు

జిల్లా ప్రధాన న్యాయమూర్తికి ఈమెయిల్‌

బాంబు, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు

అటువంటిదేమీ లేదని నిర్ధారణ

విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):

విశాఖ జిల్లా కోర్టుకు గురువారం గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టు అధికారులు విషయాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చికి తెలియజేయడంతో బాంబ్‌స్క్వాడ్‌ కోర్టు ఆవరణలో తనిఖీ చేపట్టింది. ఎలాంటి బాంబు లేదని నిర్ధారించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్టు గుర్తుతెలియని వ్యక్తులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజుకు ఈమెయిల్‌ పంపించారు. ఈమెయిల్‌ పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి దీనిపై సీపీకి లేఖ రాశారు. ప్రధాన న్యాయమూర్తి లేఖపై వెంటనే స్పందించిన సీపీ బాంబు స్క్వాడ్‌ సిబ్బందితోపాటు టూటౌన్‌ సీఐ ఎర్రంనాయుడును కోర్టు ప్రాంగణంలో తనిఖీల కోసం పంపించారు. బాంబు స్క్వాడ్‌ సిబ్బంది మెటల్‌ డిటెక్టర్లతో కోర్టు ఆవరణలోనూ, హాళ్లలోనూ తనిఖీ చేశారు. పార్కింగ్‌లో ఉన్న వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్‌ కూడా వచ్చింది. ఎక్కడా బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కోర్టు అధికారులు ఇచ్చిన సమాచారం, ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.


సింహాచలం మాజీ ఈఓకు చార్జిమెమో

పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం

మాస్టర్‌ప్లాన్‌లో లేని పనులు చేపట్టడమే

చందనోత్సవం రోజున ప్రమాదానికి కారణంగా గుర్తింపు

విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):

సింహాచలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ అధికారిగా పనిచేసిన వేండ్ర త్రినాథరావుకు దేవదాయ శాఖ నుంచి చార్జిమెమో జారీ అయింది. దానిపై పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ హరి జవహర్‌లాల్‌ గురువారం నోటీసు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న సింహాచలం కొండపై చందనోత్సవం జరిగింది. అక్కడ ఒక గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఆ కమిటీ దేశాల మేరకు పలువురు ఇంజనీర్లను సస్పెండ్‌ చేసి, వారిపై క్రిమినల్‌ కేసులు కూడా నమోదుచేశారు. ఆ సమయంలో ఈఓగా పనిచేసిన త్రినాథరావుపై కూడా విచారణ జరిగింది.

సింహగిరిపై అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్‌’ పథకం కింద రూ.52 కోట్లు ఇచ్చింది. వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై మాస్టర్‌ ప్లాన్‌ తయారుచేశారు. అయితే దానికి విరుద్ధంగా కొన్ని పనులు చేపట్టారు. అందులో భాగంగానే జోడుభద్రాల వద్ద గోడ నిర్మించారు. దానికి సరైన పునాదులు లేకపోవడంతో చందనోత్సం రోజు తెల్లవారుజామున కురిసిన వర్షానికి కూలిపోయింది. ఆ గోడ పక్క నుంచే భక్తులకు క్యూలైన్లు పెట్టడంతో ఆ సమయంలో అక్కడున్న వారిలో ఏడుగురు మరణించారు. మాస్టర్‌ప్లాన్‌లో లేని పనులకు అనుమతి ఇవ్వడమే ఈ ప్రమాదానికి కారణమని గుర్తించి ఈఓపై చార్జిమెమో ఇచ్చారు. అందులో పేర్కొన్న అంశాలకు అవునా?, కాదా?...అనే సమాధానాలు పది రోజుల్లో ఇవ్వాలని ఆదేశించారు. ఈలోగా విచారణను ప్రభావితం చేసేలా ఎటువంటి ఒత్తిళ్లు పెట్టినా దానిపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.


కోడిమాంసం ధర పైపైకి..

కిలో స్కిన్‌లెస్‌ రూ.310

విశాఖపట్నం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి):

కోడి మాంసం ధర రికార్డు స్థాయికి చేరింది. శుక్రవారం నాటి మార్కెట్‌లో స్కిన్‌లెస్‌ కిలో ధర రూ.310, విత్‌ స్కిన్‌ రూ.300, లైవ్‌ (కోడి) రూ.165గా నిర్ణయించారు. ఈ ధర ఇంకా పెరుగుతుందని వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో పలు ఇబ్బందులు ఎదురుకావడంతో కోళ్ల పెంపకం చేపట్టేందుకు రైతులతో పాటు కార్పొరేట్‌ కంపెనీలు వెనుకంజ వేశాయి. దాంతో ప్రస్తుతం మార్కెట్‌ డిమాండ్‌కు తగినన్ని కోళ్లు దొరకడం లేదు. సంక్రాంతి పండుగ నాటికి డిమాండ్‌కు తగినన్ని కోళ్లు లభ్యం కాకపోతే ధరలు మరింత పెరుగుతాయని రిటైలర్లు అంటున్నారు.

Updated Date - Jan 09 , 2026 | 01:10 AM