Share News

బౌద్ధుల ఆరామం బొజ్జన్నకొండ

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:49 AM

ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండకు సందర్శకులు, పర్యాటకుల రాక ఏటేటా పెరుగుతున్నది. నిత్యం వందలాది మంది బొజ్జన్నకొండను సందర్శిస్తున్నారు. విదేశీయులు, బౌద్ధ భిక్షువులు తరుచూ బొజ్జన్నకొండను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కొండపై వున్న పురాతన శిలాసంపదను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున ఇక్కడ బౌద్ధమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించడానికి విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది.

బౌద్ధుల ఆరామం బొజ్జన్నకొండ
బొజ్జన్నకొండపై శిలాసంపద

ఏటేటా పెరుగుతున్న సందర్శకులు

పురావస్తు శాఖ ఆధ్వర్యంలో రూ.7.5 కోట్లతో అభివృద్ధి

కనుమ పండుగనాడు బౌద్ధమేళా

దేశ, విదేశాల నుంచి తరలిరానున్న బౌద్ధ భిక్షువులు

కొండదిగువ మైదానంలో తీర్థం

తుమ్మపాల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ బౌద్ధక్షేత్రం బొజ్జన్నకొండకు సందర్శకులు, పర్యాటకుల రాక ఏటేటా పెరుగుతున్నది. నిత్యం వందలాది మంది బొజ్జన్నకొండను సందర్శిస్తున్నారు. విదేశీయులు, బౌద్ధ భిక్షువులు తరుచూ బొజ్జన్నకొండను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. కొండపై వున్న పురాతన శిలాసంపదను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఏటా కనుమ పండుగ రోజున ఇక్కడ బౌద్ధమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది మరింత ఘనంగా నిర్వహించడానికి విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది.

బొజ్జన్నకొండకు ఘన చరిత్ర ఉంది. క్రీస్తు శకం నాలుగు-తొమ్మిది శతాబ్దాల మధ్య కాలంలో ఇక్కడ బౌద్ధ ఆరామాలు విరాజిల్లినట్టు చరిత్ర చెబుతున్నది. అయితే 1906-07 సంవత్సరాల్లో అప్పటి బ్రిటీష్‌ పాలకుల అధికారి అలెగ్జాండర్‌ రిమ్‌ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిగే వరకు ఇక్కడ బౌద్ధ ఆరామాలు ఉన్నట్టు బాహ్య ప్రపంచానికి తెలియదు. తవ్వకాల్లో అలనాటి రాజశాసనాలు, నాణేలు, బౌద్ధక్షేత్ర అవశేషాలు బయటపడ్డాయి. ఇక్కడ లభించిన బంగారు నాణేల్లో కొన్ని సముద్రగుప్తుని హయాంలోవి కాగా మరికొన్ని శాతవాహనుల కాలం నాటివని చరిత్రకారులు నిర్ధారించారు. కొండ మొదటి గుహ వద్ద బుద్ధుని నిలువెత్తు స్థూపం ఉంది. బౌద్ధ భిక్షువులు నిత్యం ధ్యానం చేస్తూ బౌద్ధమతం గురించి ఈ ప్రాంతంలో ప్రచారం చేసేవారని చెబుతుంటారు. పక్కనే ఉన్న కొండపై వందల సంఖ్యలో లింగాకార స్థూపాలు ఉన్నాయి. స్థానికులు దీనిని లింగాల కొండగా పిలుస్తుంటారు.

పర్యాటకంగా గుర్తింపు

కేంద్ర పురావస్తు శాఖ నిర్వహిస్తున్న బొజ్జన్నకొండను నిత్యం ఎంతోమంది సందర్శిస్తుంటారు. కొండపైన, గుహలోపల శిల్ప సంపద, బుద్ధుని విగ్రహాలు, ధాన్య మందిరాలు, బౌద్ధ భిక్షువుల ఆవాసం కోసం పెద్ద పరిమాణంలోగల ఇటుకలతో నిర్మించిన కట్టడాలు ఆకట్టుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.7.5 కోట్లు వ్యయం చేసి పలు అభివృద్ధి పనులు చేపట్టింది. లేజర్‌ షో, సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ షో, ధ్యాన మందిరం, ముఖద్వారం నిర్మించారు. దీంతో బొజ్జన్నకొండ మరింత ఆకర్షణీయంగా మారింది. బొజ్జన్నకొండకు వెళ్లాలంటే ఎలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల నుంచి వచ్చే వారు అనకాపల్లి పట్టణం నుంచి చోడవరం రోడ్డులో తుమ్మపాల చేరుకొని, ఇక్కడి నుంచి తూర్పు దిశగా ప్రయాణించాలి. విశాఖ, గాజువాక వైపు నుంచి వచ్చే వారు సుంకరమెట్ట జంక్షన్‌ వద్ద కుడివైపునకు మళ్లి, సబ్బవరం వైపు వెళ్లే జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో ప్రయాణించి, ఏలేరు కాలువ వద్ద ఎడమ వైపునకు మళ్లాలి. ఇక్కడి నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించి బొజ్జన్నకొండకు చేరుకోవచ్చు.

కనుమ పండుగనాడు బౌద్ధమేళా

ప్రతి ఏటా కనుమ పండుగ రోజున బొజ్జనకొండ వద్ద బౌద్ధ మేళా నిర్వహిస్తుంటారు. ఇందుకోసం విశాఖ బౌద్ధ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. కొండపై ప్రత్యేక ప్రార్థనలు, శాంతిర్యాలీ, బుద్ధుని ఉపన్యాసాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దేశ, విదేశాల నుంచి బౌద్ధ భిక్షువులు హాజరవుతారు. కొండదిగువున ఉన్న మైదానంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ ఎత్తున బొజ్జన్నకొండ తీర్థం జరుగుతుంది. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఇటీవల బొజ్జన్నకొండ ప్రాంతాన్ని పరిశీలించి బౌద్ధమేళా, తీర్థం ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Jan 14 , 2026 | 12:49 AM