మార్చిలోగా బీఎన్ రోడ్డు పనులు పూర్తి
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:53 AM
చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బీఎన్ రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయని, మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్ సుధాకర్, ఈఈ సాంబశివరావు గురువారం జిల్లా జడ్జికి స్పష్టం చేశారు. బీఎన్ రోడ్డు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై స్థానిక న్యాయవాది కాండ్రేగుల డేవిడ్, తదితరులు జిల్లా కోర్టులో దాఖలు చేసిన కేసుకు సంబంధించి గురువారం స్థానిక కోర్టు విచారణకు హాజరైన ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు, రోడ్డు పనులకు సంబంధించిన పురోగతిని వివరించారు.
జిల్లా కోర్టుకు తెలిపిన ఆర్‌అండ్‌బీ అధికారులు
ఇప్పటికే పనులు మొదలైనట్టు వెల్లడి
కేసును వచ్చే నెల 28కి వాయిదా వేసిన జిల్లా జడ్జి
చోడవరం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బీఎన్ రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయని, మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ జాన్ సుధాకర్, ఈఈ సాంబశివరావు గురువారం జిల్లా జడ్జికి స్పష్టం చేశారు. బీఎన్ రోడ్డు అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై స్థానిక న్యాయవాది కాండ్రేగుల డేవిడ్, తదితరులు జిల్లా కోర్టులో దాఖలు చేసిన కేసుకు సంబంధించి గురువారం స్థానిక కోర్టు విచారణకు హాజరైన ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు, రోడ్డు పనులకు సంబంధించిన పురోగతిని వివరించారు. ప్రభుత్వం రోడ్డు కాంట్రాక్టర్‌కు రూ.10 కోట్ల బకాయిలు చెల్లించిందని, వడ్డాది- చోడవరం మధ్య పనులు మొదలయ్యాయని వివరించారు. మార్చి నెలాఖరుకల్లా పనులు పూర్తవుతాయని హామీ ఇచ్చారు. తరువాత జిల్లా జడ్జి ఎం.హరినారాయణ కేసును ఫిబ్రవరి 28వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం న్యాయవారి కాండ్రేగుల డేవిడ్ కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, బీఎన్ రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమైనందున మార్చిలోగా పూర్తి చేస్తామన్న ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారుల హామీని నమ్ముతున్నామని చెప్పారు. విజయరామరాజుపేట, వడ్డాది వంతెనలతోపాటు, కల్వర్టుల నిర్మాణం కూడా త్వరిగతిన పూర్తి చేయాలని కోరారు.