బీఎన్ రోడ్డు మరింత ఛిద్రం
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:27 AM
వర్షాకాలం మొదలవడంతోనే బీఎన్ రోడ్డులో వాహనదారులు, ప్రయాణికులకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు అడుగడుగునా ఏర్పడిన గోతుల్లో బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలకు నీరు చేరి, మరింత దుర్భరంగా తయారైంది.
చోడవరం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం మొదలవడంతోనే బీఎన్ రోడ్డులో వాహనదారులు, ప్రయాణికులకు కష్టాలు ప్రారంభం అయ్యాయి. చోడవరం నుంచి వెంకన్నపాలెం వరకు అడుగడుగునా ఏర్పడిన గోతుల్లో బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలకు నీరు చేరి, మరింత దుర్భరంగా తయారైంది. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరిగే ఈ రహదారి అభివృద్ధి పనులు పూర్తికాకపోగా, రోడ్డుపై ఏర్పడిన గుంతలు మరింత పెద్దవిగా మారి, వర్షం నీటితో చెరువుల్లా తయారయ్యాయి. వర్షా కాలంలో గోతులు కప్పే అవకాశం లేకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారవుతుందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
మోస్తరు వర్షం ... చల్లబడిన వాతావరణం
అనకాపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో గురువారం తెలికపాటి వర్షం కుసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లగా వుంది. రెండు రోజుల క్రితం వరకు ఎండ తీవ్రత, వడగాడ్పులతో ఇబ్బంది పడిన ప్రజలు, మారిన వాతావరణంతో ఉపశమనం చెందారు. బుచ్చెయ్యపేట, మాడుగుల, అనకాపల్లి, చోడవరం, రావికమతం, కశింకోట, ఎలమంచిలి, సబ్బవరం, చీడికాడ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. పరవాడ, కె.కోటపాడు, ఎస్.రాయవరం, మాకవరపాలెం మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. బుధ, గురువారాల్లో కురిసిన వర్షాలతో పొడి దుక్కులు దున్ని, నారుమడులు తయారు చేసుకుని వరి విత్తనాలు చల్లుకునేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే వరి విత్తనాల పంపిణీని ప్రారంభించారు.