విరబూసిన గ్లాడియోలస్
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:41 AM
ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో గ్లాడియోలస్ పూలు విరబూశాయి. పరిశోధన స్థానాన్ని సందర్శించిన పర్యాటకులను గ్లాడియోలస్ పూల సోయగాలు ఆకట్టుకుంటున్నాయి.
ఆర్‌ఏఆర్‌ఎస్‌లో సందర్శకులకు కనువిందు
చింతపల్లి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో గ్లాడియోలస్ పూలు విరబూశాయి. పరిశోధన స్థానాన్ని సందర్శించిన పర్యాటకులను గ్లాడియోలస్ పూల సోయగాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు మూడేళ్లగా గ్లాడియోలస్, లిల్లియం, జర్బరా, చైన ఆస్టర్ పూలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. గ్లాడియోలస్, జర్బరా పూల సాగు గిరిజన ప్రాంతానికి అత్యంత అనుకూలమని శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక సాగు ద్వారా నిరూపించారు. శాస్త్రవేత్తల సహకారంతో లంబసింగి ప్రాంతంలో కొంత మంది రైతులకు గ్లాడియోలస్, జెర్బరా, వివిధ పూల సాగు చేపడుతున్నారు. పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు సాగుచేసిన పలు వర్ణాల గ్లాడియోలస్ పూలు ఆకర్షణీయంగా, ఏపుగా పెరిగాయి. దీంతో పరిశోధన స్థానం సందర్శించిన పర్యాటకులు గ్లాడియోలస్ పూల వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గ్లాడియోలస్, జర్బరా పూల సాగుకు అత్యంత అనుకూలమన్నారు. గిరిజన రైతులు గ్లాడియోలస్ సాగుపై ఆసక్తి చూపితే సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పది, పదిహేను మంది గిరిజన రైతులు గ్రూప్‌గా గ్లాడియోలస్ సాగు చేసుకుంటే మంచిదన్నారు. రైతులు సాగు చేసిన పూలకు ఉద్యానశాఖ, ఐటీడీఏ మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే ఆర్థిక ప్రగతి సాధించే అవకాశం ఉందని తెలిపారు.