విరబూసిన కాఫీ పూలు
ABN , Publish Date - Mar 08 , 2026 | 11:33 PM
మన్యం కాఫీ తోటలు పూల పరిమళాలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చి ప్రారంభంలోనే కాఫీ తోటలు పూతకొచ్చాయి.
చింతపల్లి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): మన్యం కాఫీ తోటలు పూల పరిమళాలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చి ప్రారంభంలోనే కాఫీ తోటలు పూతకొచ్చాయి. చిన్నగెడ్డ, రౌరింతాడ, పెద్దగెడ్డ, లంబసింగి, జీకేవీధి ప్రాంతంలో కాఫీ తోటలు విరబూశాయి.
సాధారణంగా మార్చి మొదటి పక్షంలో తొలకరి వర్షాలు కురుస్తాయి. దీంతో రెండో పక్షంలో కాఫీ తోటలు పూతకు వస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24, 25 తేదీల్లో చింతపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రెండు రోజుల్లో 48.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నెలాఖరుకు కాఫీ తోటల్లో మొగ్గలు తొడిగాయి. ప్రస్తుతం పచ్చని మొక్కల్లో శ్వేత వర్ణపుష్పాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కాఫీ పూలు సన్నజాజుల మాదిరిగా సువాసనలు వెదజల్లుతున్నాయి. దీంతో చింతపల్లి- నర్సీపట్నం, జీకేవీధి-చింతపల్లి, పెదవలస మార్గంలో ప్రయాణించే వారు, పర్యాటకులు కాఫీ పూల సువాసనలను ఆస్వాదిస్తూ ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముందుగానే పూత రావడం వల్ల ఈ నెలలో రెండు, మూడు మంచి వర్షాలు కురిస్తే కాఫీ దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని, ఎండ తీవ్రత అధికంగా ఉంటే పూత మాడిపోయి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఉద్యాన శాస్త్రవేత్త చెట్టి బిందు తెలిపారు.