Share News

రక్తమోడిన హైవే

ABN , Publish Date - Apr 24 , 2026 | 01:14 AM

జాతీయ రహదారిపై అనకాపల్లి పట్టణ పరిధిలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలకు సంబంధించి ట్రాఫిక్‌ ఎస్‌ఐలు డి.శేఖరం, అర్జునరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

రక్తమోడిన హైవే
23ఎకెపిటౌన్‌-10- లగిశెట్టి జగదీశ్‌ (ఫైల్‌ ఫొటో) 23ఎకెపిటౌన్‌-12- వెంకట రాంప్రసాద్‌ (ఫైల్‌ ఫొటో)

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

శారదా నది వంతెన వద్ద, నూకాంబిక ఆలయ ముఖద్వారం జంక్షన్‌లో ఘటనలు

ఒకరిది గోపాలపట్నం, మరొకరిది పెదపల్లి

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై అనకాపల్లి పట్టణ పరిధిలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలకు సంబంధించి ట్రాఫిక్‌ ఎస్‌ఐలు డి.శేఖరం, అర్జునరావు అందించిన వివరాలిలా ఉన్నాయి.

పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన లంక వెంకట రాంప్రసాద్‌ (39) టూరిస్టు బస్సుల్లో భక్తులను తీర్థ యాత్రలకు తీసుకువెళుతుంటాడు. ఇందులో భాగంగా బుధవారం అదే గ్రామానికి చెందిన కర్రి మణికంఠతో కలిసి అనకాపల్లిలో ట్రావెల్‌ బస్సును మాట్లాడడానికి ద్విచక్ర వాహనంపై వచ్చారు. ఇక్కడ పని పూర్తయిన తరువాత రాత్రి పది గంటల ప్రాంతంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. ఉమ్మలాడ జంక్షన్‌ దాటిన తరువాత శారదా నది వంతెన వద్ద వెనుక నుంచి వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో ఎడమ వైపున వున్న డివైడర్‌ను ఢీకొన్నాడు. రాంప్రసాద్‌ కుడివైపునకు పడిపోగా రెప్పపాటులో అతని తల మీద నుంచి వాహనం వెళ్లిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎడమ వైపునకు పడిపోయిన మణికంఠకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఎన్టీఆర్‌ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శేఖరం తెలిపారు.

తోటాడ వెళుతూ...

ఎలమంచిలి మునిసిపాలిటీ పరిధిలోని పెదపల్లికి చెందిన లగిశెట్టి జగదీశ్‌ (18) డీజే ఈవెంట్లు చేస్తుంటాడు. వృత్తిలో భాగంగా మునగపాక మండలం తోటాడ వెళ్లేందుకు స్నేహితుడు కె.చంద్రశేఖర్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. జాతీయ రహదారిలో నూకాంబిక ఆలయ ముఖద్వారం జంక్షన్‌లో తోటాడ వెళ్లేందుకు మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వస్తున్న బొలేరో వ్యాన్‌ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి, క్షతగాత్రులను ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జగదీశ్‌ మృతిచెందాడు. ఇతని తల్లి విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అర్జునరావు తెలిపారు.

Updated Date - Apr 24 , 2026 | 01:14 AM