Share News

రక్తమోడిన బీచ్‌రోడ్డు

ABN , Publish Date - Aug 06 , 2026 | 01:27 AM

భీమిలి బీచ్‌రోడ్డులోని తిమ్మాపురం కూడలి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలకు గురైన వివాహిత ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. భీమిలి ఎస్‌ఐ జె.సురేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రక్తమోడిన బీచ్‌రోడ్డు
మృతురాలు కృష్ణవేణి (ఫైల్‌ ఫొటో)

తిమ్మాపురం కూడలిలో ప్రమాదం

స్కార్పియోను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం

యువకుడు, రోడ్డు పక్కన నిల్చున్న మహిళ మృతి

భీమునిపట్నం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి):

భీమిలి బీచ్‌రోడ్డులోని తిమ్మాపురం కూడలి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన ఘోర ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలకు గురైన వివాహిత ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. భీమిలి ఎస్‌ఐ జె.సురేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

విజయనగరం జిల్లా జామి గ్రామానికి చెందిన ఎం.పుష్పారావు, గ్రంధి సూరి (22) నగరం నుంచి బైక్‌పై భీమిలి వైపు వెళుతున్నారు. అదేమార్గంలో వారి ముందు స్కార్పియో వాహనం అపరిమిత వేగంతో వెళుతోంది. అప్పటివరకూ రోడ్డుకు కుడి వైపున నడుస్తున్న స్కార్పియో తిమ్మాపురం కూడలి వద్ద ఒక్కసారిగా ఎడమ వైపు తిప్పారు. దీంతో వెనుక వేగంగా వస్తున్న ద్విచక్ర వాహన చోదకుడు కారును బలంగా ఢీకొట్టాడు. అదేవేగంతో రోడ్డు పక్కన నిల్చున్న తిమ్మాపురానికి చెందిన వాసుపల్లి కృష్ణవేణి (43)ని కూడా ఢీకొనడంతో ఆమె ఎగిరి పక్కనున్న విద్యుత్‌ స్తంభంపై పడ్డారు. ఆమె తలకు బలమైన గాయమై, తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో స్థానికులు అంబులెన్స్‌లో గీతం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. కృష్ణవేణి రుషికొండలోని ఓ రెస్టారెంట్‌లో హౌస్‌ కీపర్‌గా పనిచేస్తోందని, రాత్రి విధులకు హాజరయ్యేందుకు వెళుతుండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులు ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో వెనుక కూర్చున్న గ్రంధి సూరి (22) తలకు బలమైన గాయమై సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. బైక్‌ నడుపుతున్న ఎం.పుష్పారావు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐలు లలిత్‌ ఆదిత్య, సురేష్‌ ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాలను భీమిలి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లోని మార్చురీకి తరలించారు. పుష్పారావును అతడి బంధువులు విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ దివాకర్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్‌ కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 01:27 AM