రక్తమోడుతున్న రహదారులు
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:26 AM
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగనంపూడి-డొంకాడ ఫ్లైఓవర్‌పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాతయ్యపాలేనికి చెందిన పడాల కొండలరావు (50) మృతిచెందారు.
నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య
ప్రమాదాలు తగ్గుతున్నట్టు చెబుతున్నా...మరణాలు పెరుగుదల
ఈ ఏడాది అక్టోబరు నాటికి 339 మంది మృతి
788 మందికి గాయాలు
బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం
వాహన చోదకుల నిర్లక్ష్యం కూడా కారణం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగనంపూడి-డొంకాడ ఫ్లైఓవర్‌పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాతయ్యపాలేనికి చెందిన పడాల కొండలరావు (50) మృతిచెందారు. లంకెలపాలెంలోని పీబీఎల్ ట్రాన్స్‌పోర్టులో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది.
ఈనెల 14న ఎయిర్‌పోర్టు జంక్షన్‌లో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో మహిళ మృతిచెందారు.
రెండు నెలల క్రితం దువ్వాడ-వడ్లపూడి వంతెన వద్ద ముందువెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు.
నగర పరిధిలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు చూపిస్తున్న గణాంకాల్లో ప్రమాదాల సంఖ్య గత ఏడాది కంటే తక్కువగానే ఉన్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మృత్యుశకటాలుగా భారీ వాహనాలు
ఆనందపురం నుంచి సబ్బవరం మీదుగా అనకాపల్లి వరకు చాలాకాలం కిందట కొత్తగా జాతీయ రహదారిని నిర్మించారు. భారీ వాహనాలన్నీ ఆ రహదారిలో వెళ్లాలి. అయితే ఆ మార్గంలో రెండు చోట్ల టోల్‌గేట్లు ఉన్నాయి. ఆ టోల్ ఫీజులు తప్పించుకునేందుకు నగరం మీదుగా ఉన్న పాత జాతీయ రహదారిపైనే భారీ వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. వాటి కారణంగానే గాజువాక, లంకెలపాలెంతోపాటు మధురవాడ, కొమ్మాది వంటి శివారు ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలు జరుగుతున్నాయి.
వాహన చోదకుల నిర్లక్ష్యం
ద్విచక్ర వాహన చోదకులతోపాటు కార్లు నడిపేవారిలో కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్, అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే అనర్థాల గురించి పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండడం లేదు. రోడ్డు ఎంత రద్దీగా ఉన్నా అపరిమిత వేగంతో వాహనం నడుపుతున్నారు. ఏదైనా అడ్డంకి ఎదురైతే వాహనాన్ని అదుపు చేయలేక ఎదుటి వారిని ఢీకొట్టడం లేదంటే వారే ప్రమాదానికి గురికావడం జరుగుతోంది.
నివారణ చర్యలపై పోలీసులు విఫలం
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 69 ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా పోలీసులు గుర్తించారు. వాటి వద్ద ప్రమాదాలు జరగడానికి గల కారణాలను గుర్తించి, వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కానీ ఇప్పటికీ అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నగరంలో రాత్రిపూట చాలా ప్రాంతాల్లో వీధిలైట్లు వెలగడం లేదు. అలాగే మలుపులు ఉన్న చోట హెచ్చరిక బోర్డులు కూడా సరిగా లేవు. జీవీఎంసీతో సమన్వయం చేసుకుని వాటిని పరిష్కరించడం, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నచోట సరిదిద్దడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం ప్రముఖుల బందోబస్తు, భద్రతాఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు చర్యల్లో నిమగ్నమవుతుండడంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై పెద్దగా దృష్టిపెట్టడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తగ్గుతున్న ప్రమాదాలు... పెరుగుతున్న మరణాలు
నగర పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నట్టు పోలీసులు చూపిస్తున్నప్పటికీ ప్రమాదాల కారణంగా మరణిస్తున్నవారి సంఖ్య మాత్రం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో మొత్తం 1,182 ప్రమాదాలు జరిగితే 326 మంది ప్రాణాలు కోల్పోగా, 1,225 మంది గాయపడ్డారు. 2024లో 1132 ప్రమాదాలు జరిగితే వాటిలో 347 మంది ప్రాణాలు కోల్పోగా 1,156 మంది గాయపడ్డారు. 2025లో 1,086 ప్రమాదాలు జరిగితే 349 మృతిచెందగా, 1038 మంది గాయపడ్డారు. ఈ ఏడాది అక్టోబరు నెలాఖరు నాటికి 894 ప్రమాదాలు జరిగితే ఏకంగా 339 మంది మృతిచెందారు. మరో 788 మందికి గాయాలయ్యాయి.
గత రెండేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మరణాల వివరాలు
సంవత్సరం ప్రమాదాల సంఖ్య మరణాలు గాయపడినవారిసంఖ్య
2023 1182 326 1225
2024 1132 347 1156
2025 1086 349 1038
2026 894 339 788
(అక్టోబరు నాటికి)
-----------------------------