Share News

రక్త నిల్వలు తగ్గుముఖం

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:36 PM

జిల్లాలో రక్త నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 54 యూనిట్లు మాత్రమే రక్త నిల్వలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.

రక్త నిల్వలు తగ్గుముఖం
ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో కొయ్యూరులో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్న దృశ్యం (ఫైల్‌ ఫొటో)

ప్రస్తుతం జిల్లాలో 54 యూనిట్లు మాత్రమే నిల్వ

సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులకు రోజుకు 10 యూనిట్లు అవసరం

విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త సేకరణ జరపకపోతే కష్టమే

కొయ్యూరు, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రక్త నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో 54 యూనిట్లు మాత్రమే రక్త నిల్వలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. అయితే రోజుకు 10 యూనిట్లు అవసరమవుతోంది. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త సేకరణ జరపకపోతే ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి.

జిల్లాలోని 11 మండలాల్లో 10 శాతం మంది మహిళలు, పాఠశాల విద్యార్థినులు రక్తహీనతతో ఏటా ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే ఎందరో ప్రమాదాల బారిన పడి సరైన సమయంలో రక్తం దొరక్క మృత్యువాత పడుతున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా గల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థినుల్లో 10 శాతం మంది సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడుతున్నారు. అటువంటి వారికి అత్యవసరంగా రోజుకు 10 యూనిట్లు రక్తం అవసరం. రక్తం నిల్వలు పెంచాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ అల్లూరి జిల్లా విభజన కాక మునుపే ప్రతీ మండలంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి 50 యూనిట్లు రక్తం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గతంలో ఉమ్మడి అల్లూరి జిల్లా వ్యాప్తంగా గల 22 మండలాల్లో ఒక్క అనంతగిరి మండలం మినహాయించి మిగిలిన 21 మండలాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అయితే నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ప్రస్తుతం జిల్లాలో ఏ- పాజిటివ్‌ 9 యూనిట్లు, ఏ, బీ పాజిటివ్‌ 10, ఏ, బీ ప్లస్‌ 7, ఓ- పాజిటివ్‌ 25 యూనిట్లు, ఓ- నెగిటివ్‌ 3 యూనిట్లు వెరసి 54 యూనిట్లు మాత్రమే రక్త నిల్వలు ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. దీంతో ఉన్న ఈ రక్త నిల్వలు పూర్తిగా వాడకం జరిగితే జిల్లాలో ఎవరికి ఏ అత్యవసరమైనా రక్తం దొరకని పరిస్థితి ఉంది.

సికిల్‌సెల్‌ ఎనీమియా బాధితులు అధికం

ఏజెన్సీలో రక్త నిల్వలు ఉంచేందుకు వీలుగా గతంలో పాడేరు, రంపచోడవరంలో బ్లడ్‌బ్యాంకులు ఏర్పాటు చేశారు. అడ్డతీగల, చింతపల్లిలో స్టోరేజీ సెంటర్లు ఉన్నాయి. అయితే వీటిల్లో రక్త నిల్వలు లేక ఖాళీగా ఉంటున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడే వారు రెండు వేలకు పైబడి ఉన్నారు. అలాగే రక్తహీనతతో ఉన్న గర్భిణులు, బాలింతలు మరో 3 వేలు నుంచి 5 వేలు వరకు ఉన్నారు. ఇది కాకుండా నేషనల్‌ హైవే 516- ఈ నిర్మాణాలు పూర్తవ్వడంతో నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడే వారు పదుల సంఖ్యలో ఉంటున్నారు. దీంతో పాడేరు వంటి కేంద్రాల్లో శస్త్ర చికిత్సల సంఖ్య పెరుగుతోంది. బాధితులకు రక్తం అందుబాటులో లేక చాలా మందిని విశాఖపట్నం తరలించాల్సి వస్తోంది. జిల్లాలో పరిస్థితిని గమనించి రక్తదాతలు ముందుకు రావాలని, అలాగే జిల్లా యంత్రాంగం అధిక సంఖ్యలో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 11:36 PM