Share News

బీపీ, షుగర్‌...

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:32 AM

జిల్లాలో హైపర్‌ టెన్షన్‌ (బీపీ), షుగర్‌ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన నాన్‌ కమ్యూనకబుల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ) 4.0 స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సర్వే గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు ఆరోగ్య సిబ్బంది నిర్వహించారు.

బీపీ, షుగర్‌...

జిల్లాలో పెరుగుతున్న బాధితులు

ఎన్‌సీడీ 4.0 స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌లో గుర్తించిన ఆరోగ్యశాఖ

13.87 శాతం మందికి హైబీపీ

11.29 శాతం మందికి షుగర్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో హైపర్‌ టెన్షన్‌ (బీపీ), షుగర్‌ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన నాన్‌ కమ్యూనకబుల్‌ డిసీజ్‌ (ఎన్‌సీడీ) 4.0 స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సర్వే గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు ఆరోగ్య సిబ్బంది నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో పనిచేసే ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించి షుగర్‌, బీపీతో బాధపడుతున్న వారిని గుర్తించారు. ఎన్‌సీడీ 4.0 సర్వేలో భాగంగా జిల్లాలో 18,59,046 మందిని స్ర్కీనింగ్‌ చేయాలన్నది లక్ష్యం కాగా, 11,01,736 మంది (59.26 శాతం)కి పరీక్షలు నిర్వహించారు. అందులో 2,56,781 మంది (13.87 శాతం) హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్నట్టు, 2,09,062 మంది (11.29 శాతం) షుగర్‌ సమస్యతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు.

ఆందోళన కలిగిస్తున్న పెరుగుదల

ఎన్‌సీడీ సర్వేను గత కొన్నాళ్లుగా ఆరోగ్యశాఖ నిర్వహిస్తోంది. గతంలో నిర్వహించిన మూడు స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్స్‌తో పోలిస్తే ఈసారి దాదాపు ఒకటి నుంచి మూడు శాతం వరకు బీపీ, షుగర్‌ బాధితుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. షుగర్‌, బీపీ రెండూ ఉన్న వారి సంఖ్య అధికంగానే ఉందంటున్నారు. అయితే దాదాపు సగం మందికి తాము బీపీ, షుగర్‌తో బాధపడుతున్న విషయం తెలియకపోవడం గమనార్హం. తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురైనప్పుడు నిర్వహించే పరీక్షల సమయంలోనే చాలామందికి ఈ తరహా సమస్యలు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇది వారికి అందించే వైద్య సేవలపై ప్రభావం చూపిస్తోంది. ఈ తరహా ఇబ్బందులకు చెక్‌ చెప్పేలా ముందుగానే ఈ వ్యాధులను గుర్తించేందుకు కొన్నాళ్లుగా ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌ ప్రోగ్రామ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.

Updated Date - Sep 02 , 2026 | 01:34 AM