డిప్యూటీ సీఎం సొంత నిధులతో బ్లడ్ బ్యాంకు
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:35 PM
అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సుమారు రూ.95 లక్షల సొంత నిధులను మంజూరు చే శారని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు.
అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో భవన నిర్మాణానికి శంకుస్థాపన
అన్ని సదుపాయాలతో తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తాం
కలెక్టర్ దినేశ్‌కుమార్
అరకులోయ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ఆవరణలో బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సుమారు రూ.95 లక్షల సొంత నిధులను మంజూరు చే శారని కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. గురువారం ఆస్పత్రి ప్రాంగణంలో ఈ నిర్మాణ పనులను కలెక్టర్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఎం.నీలవేణి, డీఎంహెచ్‌వో నాయక్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.రాము ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులపై మమకారంతో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణానికి సొంత నిధులు ఇచ్చారన్నారు. ఆ నిధులతో అన్ని సౌకర్యాలతో భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అనంతరం ప్రభుత్వపరంగా బ్లడ్ బ్యాంకుకు అవసరమైన మెషినరీ, ఫర్నిచర్ ఏర్పాటు చేస్తామని, డిప్యూటీ సీఎంతోనే దీనిని ప్రారంభింపజేస్తామని చెప్పారు. అరకు ఏరియా ఆస్పత్రికి అవసరమైన వైద్య నిపుణులు, వనరుల కల్పనతో గిరిజనులకు మరింత మెరుగైన వైద్యసేవలందించే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఆస్పత్రిలో గైనకాలజిస్టులు, ఎనస్థీషియన్ తదితర వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతంలోని ఆస్పత్రుల్లో రెండేళ్ల పాటు సేవ చేసేందుకు వైద్యులు, వైద్యనిపుణులు ముందుకు రావాలన్నారు. వారికి అవసరమైన నివాసాలు, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. రెండేళ్ల తర్వాత మైదానప్రాంతాలకు బదిలీలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉషారాణి, ఎంపీటీసీ సభ్యుడు దురియా ఆనందరావు, ఎంపీడీవో లవరాజు, డిప్యూటీ తహశీల్దార్ మత్స్యరాజు, వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.