Share News

బ్లడ్‌ బ్యాంకుల్లో నిండుకుంటున్న నిల్వలు

ABN , Publish Date - May 09 , 2026 | 01:05 AM

బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. కొద్దివారాల నుంచి రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.

బ్లడ్‌ బ్యాంకుల్లో నిండుకుంటున్న నిల్వలు

జిల్లా 20కుపైగా బ్లడ్‌ బ్యాంకులు

సాధారణ రోజుల్లో 20 నుంచి 30 యూనిట్లు చొప్పున సరఫరా

కొద్ది వారాలుగా పది యూనిట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి

డోనర్‌ ఉంటే తప్ప బ్లడ్‌ ఇవ్వలేమని చెబుతున్న బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులు

విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి):

బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. కొద్దివారాల నుంచి రక్తం ఇచ్చేందుకు దాతలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా వేసవిలో రక్తదాతల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. దాతల్లో దాదాపు 60 శాతానికిపైగా విద్యార్థులు ఉంటారు. కాలేజీల్లో, ఇతర సంస్థలు ఆధ్వర్యంలో నిర్వహించే శిబిరాల ద్వారా, వ్యక్తిగతంగా వచ్చి రక్తదానం చేస్తుంటారు. అలా సేకరించిన రక్తాన్ని బ్లడ్‌ బ్యాంకుల నిర్వాహకులు అవసరమైన రోగులకు అందిస్తుంటారు. అయితే చదువుల కోసం నగరంలో ఉండే విద్యార్థులంతా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో సొంతూళ్లకు వెళుతుంటారు. వేసవి తీవ్రత వల్ల కలిగే ఇబ్బందులతో మరికొంతమంది విద్యార్థులు, ఇతరులు కూడా ఈ సమయంలో రక్తదానం చేసేందుకు ఆసక్తి చూపించరు. దీనివల్ల కొరత ఏర్పడుతోందని, గడిచిన రెండు, మూడు వారాలు నుంచి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

డోనర్‌ తప్పనిసరి

జిల్లాలో 20 వరకు బ్లడ్‌ బ్యాంకులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఒక్కో బ్లడ్‌ బ్యాంకు నుంచి కనీసం 20 నుంచి 30 యూనిట్లు అందిస్తుంటారు. ఇలా ఇచ్చే యూనిట్లలో దాదాపు మూడొంతులు డోనర్స్‌ (రోగితో సంబంధం లేని) నుంచి సేకరించినవే ఉంటాయి. అయితే, ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు నిండుకోవడంతో పది యూనిట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగుల సహాయకుల్లో ఎవరైనా బ్లడ్‌ డొనేట్‌ చేయడానికి ముందుకురావాలని బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులు కోరుతున్నారు. అలా, ముందుకు వచ్చిన వారికి అవసరమైన బ్లడ్‌ ఏర్పాటు చేస్తున్నారు. మరో నాలుగైదు వారాల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

ప్లాన్డ్‌ సర్జరీలు

రోడ్డు ప్రమాద బాధితులకు, తలసీమియా బాధితులకు, ప్రసవాలు, ఇతర మేజర్‌ శస్త్ర చికిత్సలు నిర్వహించే సమయంలో రక్తం కావాల్సి ఉంటుంది. ఇవన్నీ, సాధారణ రోజుల్లో మాదిరిగా ఉండే అవసరాలే. అయితే, వేసవి సెలవుల్లో కొన్ని రకాల సర్జరీలను కొందరు ప్రణాళిక ప్రకారం చేయించుకుంటారు. సెలవులు, ఇతర కారణాలతో చేయించుకునే ప్లాన్డ్‌ సర్జరీల వల్ల కూడా మరో పది నుంచి 20 శాతం వరకు బ్లడ్‌ అవసరం పెరుగుతోందని, ఇది కూడా కొరతకు కారణమవుతున్నట్టు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయ వర్గాల ద్వారా సేకరిస్తున్నాం

- వివినోద్‌ బాలు, రక్తదాన చైతన్యకర్త

కొద్దిరోజులు నుంచి బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు నిండుకోవడంతో ఇబ్బందిగా మారింది. విద్యార్థులు లేకపోవడం, వేసవి వల్ల రక్తందానం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రోగులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాం. రక్తదానం చేసేందుకు ఆసక్తి ఉన్న ఇతర వర్గాలను కలుస్తూ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సామాజిక స్పృహ ఉన్న యువతను సంప్రతించి రక్తదానం చేసేలా వారిని ఒప్పిస్తున్నాం. వీలైనంత వరకు ఇబ్బందులు లేని ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టేందుకు అవకాశం ఉంటుంది.

Updated Date - May 09 , 2026 | 01:05 AM