మేయర్ సీటుపై బీజేపీ ఆసక్తి
ABN , Publish Date - Sep 24 , 2026 | 01:26 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ స్థానానికి పోటీ చేయాలని బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఇక్కడే ఉండడం, గతంలో కార్పొరేషన్‌కు మొదటి మేయర్‌గా ఎన్నికైన ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి బీజేపీకి చెందిన వారే కావడం పార్టీకి కలిసి వచ్చే అంశాలని వారు భావిస్తున్నారు.
రేసులో కాశీ విశ్వనాథరాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కుమార్తె దీపిక,
‘వెంగమాంబ’ శ్రీనివాస్
జనసేనలోను చర్చలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ స్థానానికి పోటీ చేయాలని బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఇక్కడే ఉండడం, గతంలో కార్పొరేషన్‌కు మొదటి మేయర్‌గా ఎన్నికైన ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి బీజేపీకి చెందిన వారే కావడం పార్టీకి కలిసి వచ్చే అంశాలని వారు భావిస్తున్నారు.
కూటమి ప్రభుత్వం విశాఖ మేయర్ స్థానానికి ఏ పార్టీ నుంచి అభ్యర్థిని నిలపాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రంలో విశాఖపట్నానికి ప్రత్యేక స్థానం ఉంది. అతి పెద్ద నగరం ఇదే. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం నాయకులు మేయర్ స్థానం కోసం పోటీ పడుతున్నారు. అయితే బీజేపీ నాయకులు కూడా ఓ ప్రయత్నం చేస్తే తప్పేముంది?...అడిగి చూద్దాం అని చర్చించుకుంటున్నారు. రాష్ట్ట్రంలో అనేక కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నందున బీజేపీకి తిరుపతి మేయర్ స్థానం కేటాయించినట్టు ప్రచారం జరుగుతోంది. విశాఖ స్థానం కూడా అడగాలని కొందరు ఆశావహులు ఆ పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఈ అభ్యర్థన మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కలిసి కూటమి పెద్దలతో దీనిపై మాట్లాడాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఒకవేళ బీజేపీకి కేటాయిస్తే మేయర్ అభ్యర్థిగా పోటీ చేయాలని సెయిల్ డైరెక్టర్ కాశీవిశ్వనాథరాజు, రాక్ డేల్ హోటల్ యజమాని వెంగమాంబ శ్రీనివాస్ భావిస్తున్నారు. వీరు కాకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కుమార్తె దీపిక పేరు కూడా ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యేగా లేకపోయినట్టయితే తానే మేయర్ అభ్యర్థిగా రంగంలో దిగేవాడినని విష్ణుకుమార్‌రాజు పార్టీ వర్గాల వద్ద పేర్కొన్నట్టు సమాచారం. వీరు కాకుండా తాజాగా అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తన భార్యను మేయర్‌గా విశాఖ నుంచి పోటీకి దింపాలని యోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నిజంగానే ఆ నిర్ణయం తీసుకుని ఉంటే విశాఖపట్నం సీటు కోసం కూటమి పెద్దలపై గట్టిగానే ఒత్తిడి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇక జనసేన నుంచి కూడా ఒకరిద్దరు తమకు అవకాశం ఇస్తే బాగుణ్ణు అని అనుకుంటున్నారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన భార్యను మేయర్ అభ్యర్థిగా పోటీలో నిలపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉత్తర నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి పసుపులేటి ఉషాకిరణ్ కూడా ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. అయితే విశాఖ మేయర్ స్థానం జనసేనకు కేటాయించే అవకాశాలు బాగా తక్కువగా ఉండడంతో ఆ పార్టీలో ఆ సీటుపై పెద్దగా చర్చలు జరగడం లేదు.