Share News

బర్డ్‌ ఫ్లూపై అప్రమ్తతం

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:09 PM

కోళ్లకు వ్యాప్తి చెందే బర్డ్‌ ఫ్లూపై ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి(డీఏహెచ్‌వో) డాక్టర్‌ వి.జయరాజ్‌ సూచించారు.

బర్డ్‌ ఫ్లూపై అప్రమ్తతం
లోతుగెడ్డలో కోళ్ల ఫామ్‌ నిర్వాహక గిరిజన రైతులతో మాట్లాడుతున్న డీఏహెచ్‌వో డాక్టర్‌ జయరాజ్‌

ఉమ్మడి అల్లూరి జిల్లాలో మూడు లక్షల కోళ్లకు ఆర్‌డీ టీకాలు

మూడు వేల పశువులకు బీమా

డీఏహెచ్‌వో డాక్టర్‌ వి.జయరాజ్‌

చింతపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కోళ్లకు వ్యాప్తి చెందే బర్డ్‌ ఫ్లూపై ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి(డీఏహెచ్‌వో) డాక్టర్‌ వి.జయరాజ్‌ సూచించారు. గురువారం మండలంలో పర్యటించిన ఆయన లోతుగెడ్డ, లంబసింగి పశువుల ఆస్పత్రిని తనిఖీ చేశారు. అలాగే భీమసింగి కోళ్ల ఫామ్‌, గొర్రెలు, మేకలు ఫామ్‌లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఏహెచ్‌వో మాట్లాడుతూ అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ తెగులు ప్రబలిందన్నారు. ఈ మేరకు జిల్లాలోనూ కోళ్లు పెంచుకుంటున్న గిరిజనులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. కోళ్ల సంరక్షణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బర్డ్‌ ఫ్లూ తెగులు లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్న పశువైద్యశాలను సంప్రతించి పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వాలన్నారు. పశువైద్యుల సూచనల మేరకు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గత నెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉమ్మడి అల్లూరి జిల్లా వ్యాప్తంగా ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి అల్లూరి జిల్లాలో 1.5 లక్షల కోళ్లకు ఆర్‌డీ టీకాలు వేశామన్నారు. మరో 1.5 లక్షల కోళ్లకు టీకాలు వేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. 55 వేల మేకలు, గొర్రెలకు షీప్‌ ఫాక్స్‌ టీకాలు వేశామని చెప్పారు. మూడు లక్షల పశువులు, మేకలు, గొర్రెలకు డీవార్మింగ్‌ మందులు వేశామన్నారు. పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లు ప్రమాదవశాత్తూ, ప్రకృతి వైపరీత్యాల వలన మరణిస్తే రైతు నష్టపోకుండా ఉండేందుకు బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. ఉమ్మడి అల్లూరి జిల్లాలో తొలివిడతగా మూడు వేల పశువులు, మేకలు, గొర్రెలకు టీకాలు వేయించామన్నారు. గిరిజన రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై అసక్తి పెంచుకోవాలన్నారు. కోళ్లు, మేకలు, పశువుల పెంపకం వల్ల అదనపు ఆదాయం పొందవచ్చునన్నారు. పశుసంపదకు వ్యాధుల సంక్రమిస్తే వెంటనే పశువైద్యాధికారులకు సమాచారం ఇస్తే వెంటనే మెరుగైన వైద్యం అందిస్తారని తెలిపారు. ఆయన వెంట పశువైద్యులు మత్స్యరాస సౌజన్యదేవి, చల్లంగి చాలిని, సంచార పశువైద్యుడు ఉపేంద్ర ఉన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:09 PM