ఏయూలో బిల్లుల రగడ
ABN , Publish Date - Sep 05 , 2026 | 01:30 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బోధన, బోధనేతర సిబ్బంది స్పోర్ట్స్, కల్చరల్ (ఉద్యోగ ఉత్సవం) కార్యక్రమాల బిల్లులు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహణలో నిధులు దుర్వినియోగం జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ నిర్వహణకు భారీగా ఖర్చు
ఉన్నతాధికారుల వద్ద కొంతమంది అభ్యంతరం
విశాఖపట్నం, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన బోధన, బోధనేతర సిబ్బంది స్పోర్ట్స్, కల్చరల్ (ఉద్యోగ ఉత్సవం) కార్యక్రమాల బిల్లులు వ్యవహారంపై తీవ్ర చర్చ జరుగుతోంది. స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహణలో నిధులు దుర్వినియోగం జరిగాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్సవాల నిర్వహణకు సుమారు రూ.4 లక్షలు ఖర్చవుతుందని అధికారులకు కమిటీ ప్రతిపాదనలు పంపించగా, అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు చెల్లించినట్టు చెబుతున్నారు. మిగిలిన మొత్తానికి బిల్లులు అందజేయగా, స్పోర్ట్స్ నిర్వహణకు ఆ స్థాయిలో నిధులు ఖర్చు కాలేదని పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. ఉద్యోగులు, దాతల సహకారంతో ఈవెంట్‌ను ముగించారని, దానికి రూ.లక్షల్లో బిల్లులు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించడంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు రచ్చ జరుగుతోంది. స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొన్న ఉద్యోగులకు కనీసం టీ షర్టులు, ట్రాక్ సూట్లు ఇవ్వలేదని, ఉద్యోగులే క్రీడా సామగ్రి తెచ్చుకున్నారని చెబుతున్నారు. భోజనాలు, మంచి నీళ్లు కూడా సొంతంగానే సమకూర్చుకున్నారని అంటున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు స్పందించడం లేదు. ఈ వ్యవహారం బయటకు రావడంతో సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏయూ అధికారులు మాత్రం అన్ని విషయాలు పరిశీలించే బిల్లులు మంజూరుచేస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా వివిధ మార్గాల్లో సమీకరించిన నిధులపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.