Share News

బీసీలకు పెద్దపీట

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:46 AM

వెనుకబడిన వర్గాల (బీసీ) రాజకీయ, సామాజిక సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది. స్థానిక సంస్థల్లో అన్ని రకాల పదవులు కలిపి 28.18 శాతం మేర బీసీలకు కేటాయించింది. దీంతో స్థానిక సంస్థల్లో గతంతో పోల్చుకుంటే బీసీల ప్రాతినిధ్యం మరింత పెరుగనున్నది. 2011 బీసీ జనాభా ఆధారంగా రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్‌ సమర్పించిన నివేదిక మేరకు, సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో నంబర్‌ 17ను జారీ చేసింది. బీసీ జనాభా అధికంగా వున్న అనకాపల్లి జిల్లాలో వీలైనంత వరకు జనరల్‌ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి. దీంతో బీసీ సామాజిక వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

బీసీలకు పెద్దపీట

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం మీద 28.18 శాతం రిజర్వేషన్లు

ఏయే స్థానాలు కేటాయించాలన్న దానిపై అధికారుల కసరత్తు

449 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 117 స్థానాలు రిజర్వు చేసే అవకాశం

ఎంపీపీ, జడ్పీటీసీ పదవుల్లో ఆరు చొప్పున..

642 సర్పంచు పదవుల్లో బీసీలకు 180?

నేడు రిజర్వేషన్లు ఖారారు చేసే అవకాశం

అనకాపల్లి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి):

వెనుకబడిన వర్గాల (బీసీ) రాజకీయ, సామాజిక సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది. స్థానిక సంస్థల్లో అన్ని రకాల పదవులు కలిపి 28.18 శాతం మేర బీసీలకు కేటాయించింది. దీంతో స్థానిక సంస్థల్లో గతంతో పోల్చుకుంటే బీసీల ప్రాతినిధ్యం మరింత పెరుగనున్నది. 2011 బీసీ జనాభా ఆధారంగా రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్‌ సమర్పించిన నివేదిక మేరకు, సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో నంబర్‌ 17ను జారీ చేసింది. బీసీ జనాభా అధికంగా వున్న అనకాపల్లి జిల్లాలో వీలైనంత వరకు జనరల్‌ స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలని కూటమి పార్టీలు నిర్ణయించుకున్నాయి. దీంతో బీసీ సామాజిక వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

రిజర్వేషన్లు ఇలా....

రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ సిఫారసుల మేరకు స్థానిక సంస్థల స్వభావాన్నిబట్టి గ్రామ పంచాయతీ వార్డుల్లో 26.73 శాతం, సర్పంచ్‌ పదవుల్లో 27.95 శాతం, ఎంపీటీసీ స్థానాల్లో 25.55 శాతం, ఎంపీపీ పదవుల్లో 24.6 శాతం, జడ్పీటీసీ స్థానాల్లో 24.6 శాతం, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో 23.08 శాతం, మునిసిపల్‌ వార్డుల్లో 32.78 శాతం, మునిపల్‌ చైర్మన్‌ పదవుల్లో 33.02 శాతం, కార్పొరేషన్ల మేయర్‌ పదవుల్లో 35.29 శాతం బీసీలకు కేటాయిస్తారు. అనధికార సమాచారం మేరకు అనకాపల్లి జడ్పీ చైర్మన్‌ పదవి, నర్సీపట్నం లేదా ఎలమంచిలి మునిసిపల్‌ చైర్మన్‌ పదవుల్లో ఒకటి.. బీసీలకు రిజర్వు చేసే అవకాశం వుంది.

జిల్లాలో ఎంపీపీ పదవులు, జడ్పీటీసీ స్థానాలు 24 చొప్పున వున్నాయి. వీటిల్లో ఆరేసి చొప్పున బీసీలకు కేటాయిస్తారని అంటున్నారు. ఎంపీటీసీ స్థానాలు 449 ఉండగా 117 వరకు బీసీలకు కేటాయించాల్సి వుంటుంది. సర్పంచు పదవులు 642కుగాను 180 వరకు బీసీలకు కేటాయిస్తారు.

బీసీల్లో హర్షాతిరేకాలు

సుమారు నాలుగు దశాబ్దాల క్రితం మండల వ్యవస్థను ప్రవేశపెట్టిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు.. 1987లో జరిగిన ఎంపీపీ, జడ్పీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి 20 శాతం సీట్లను బీసీలకు కేటాయించారు. తరువాత 1995లో చంద్రబాబునాయుడు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతానికి పెంచారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం 24 శాతానికి తగ్గించింది. దీంతో వేలాది మంది బీసీలు ‘స్థానిక’ పదువులకు దూరమయ్యారు. తాజాగా కూటమి ప్రభుత్వం బీసీలకు సుమారు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోలు జారీ చేయగా.. వైసీపీ మద్దతుదారులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. అయినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 24 శాతం కన్నాఎక్కువగా 28.18 శాతం పదవులను బీసీలకు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బీసీ సామాజిక వర్గాల నేతలు, సాధారణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు

ఎలమంచిలిలో బీసీలకు పది వార్డులు?

మొత్తం ఓటర్లలో 80.88 శాతం వీరే!

ఎలమంచిలి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో గతంలో 25 వార్డులు వుండగా.. పునర్విభజనలో భాగంగా వీటి సంఖ్య 32కు పెరిగింది. మునిసిపాలిటీల్లోని వార్డుల్లో బీసీలకు 32.78 శాతం స్థానాలు కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలమంచిలిలో 10 వార్డులను బీసీలకు రిజర్వు చేసే అవకాశం వుంది. అయితే ఏయే వార్డులను బీసీలకు కేటాయించాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో ఏ వార్డు, ఏ కేటగిరీకి రిజర్వు అయిందో పరిగణనలోకి తీసుకొని, రోటేషన్‌ విధానంలో రిజర్వేషన్లు అమలు చేస్తారని అధికారులు అంటున్నారు. మునిసిపాలిటీలో మొత్తం 36,526 మంది ఓటర్లు వున్నారు. వీరిలో పురుషులు 17,450 మంది, మహిళలు 19,068 మంది, ఇతరులు ఎనిమిది మంది ఉన్నారు. కేటగిరీల వారీగా ఓటర్ల వివరాలను పరిశీలిస్తే.. బీసీలు 29,543 మంది (80.88 శాతం) వున్నారు. వీరిలో పురుషులు 14,112 మంది, మహిళలు 15,426 మంది, ఇతరులు ఐదుగురు వున్నారు. ఎస్సీ ఓటర్లు 3,243 మందికిగాను పురుషులు 1,534 మంది, మహిళలు 1,707 మంది, ఇతరులు ఇద్దరు; ఎస్టీ ఓటర్లు 38 మందికిగాను వీరిలో పురుషులు 20 మంది, మహిళలు 18 మంది వున్నారు.

నర్సీపట్నంలో బీసీలకు 13 వార్డులు?

రిజర్వేషన్ల ఖరారుపై అధికారుల కసరత్తు

నేటి సాయంత్రంలోగా ప్రకటించే అవకాశం

నర్సీపట్నం, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక మునిసిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారుపై రాజకీయ వర్గాల్లో తీవ్రఉత్కంఠ నెలకొంది. పునర్విభజన తరువాత వార్డుల సంఖ్య 28 నుంచి 40కి పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిషన్‌ సమర్పించిన నివేదిక మేరకు మునిసిపాలిటీల్లోని వార్డుల్లో బీసీలకు 32.78 శాతం స్థానాలు కేటాయించాలని నిర్ణయించింది. ఈ ప్రకారం నర్సీపట్నంలో 13 వార్డులను కచ్చితంగా బీసీలకు రిజర్వు చేసే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలకు ఆరు, ఎస్టీలకు ఒకటి కేటాయిస్తారని, మిగిలిన 20 స్థానాలు జనరల్‌గా వుంటాయని చెబుతున్నారు. మొత్తం మీద ప్రతి కేటగిరీలో సగం స్థానాలను మహిళలకు రిజర్వు చేయాల్సి వుంటుంది. కాగా ఏయే వార్డులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలన్న దానిపై మునిసిపల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి రిజర్వేషన్లను ఖరారు చేసి ప్రకటించే అవకాశం వుందని సమాచారం.

Updated Date - Oct 12 , 2026 | 12:46 AM