బీసీలకు పెద్దపీట
ABN , Publish Date - Aug 15 , 2026 | 01:11 AM
స్థానిక సంస్థల పదవుల రిజర్వేషన్ల ఖరారులో వెనుకబడిన వర్గాలకు (బీసీ) ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ‘బీసీ డెడికేటెడ్ కమిషన్’ సిఫారసుల అధారంగా గ్రామపంచాయతీలు, ఎంపీటీసీ/ స్థానాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల్లో గతంలో కన్నా బీసీలకు సీట్లు పెరగనున్నాయి. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం వుంది. పంచాయతీ సర్పంచులు, మునిసిపాల్ వార్డుల్లో బీసీలకు సముచితరీతిలో సీట్లు పెరగనున్నాయి.
స్థానిక సంస్థల్లో అధిక ప్రాధాన్యం
సర్పంచ్ పదవుల్లో 37.62 శాతం కేటాయింపు
ఎంపీటీసీ స్థానాల్లో 28.20 శాతం..
మునిసిపల్ వార్డుల్లో 37.74 శాతం
గతంలో పోలిస్తే బీసీలకు పెరగనన్న సీట్లు
తొమ్మిది నుంచి ఆరుకు తగ్గిన జడ్పీటీసీ స్థానాలు
ప్రభుత్వానికి బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
స్థానిక సంస్థల పదవుల రిజర్వేషన్ల ఖరారులో వెనుకబడిన వర్గాలకు (బీసీ) ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ‘బీసీ డెడికేటెడ్ కమిషన్’ సిఫారసుల అధారంగా గ్రామపంచాయతీలు, ఎంపీటీసీ/ స్థానాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల్లో గతంలో కన్నా బీసీలకు సీట్లు పెరగనున్నాయి. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం వుంది. పంచాయతీ సర్పంచులు, మునిసిపాల్ వార్డుల్లో బీసీలకు సముచితరీతిలో సీట్లు పెరగనున్నాయి.
జిల్లాలో ప్రస్తుతం 646 గ్రామ పంచాయతీలు ఉండగా, వీటిలో 243 సర్పంచ్ పదవులను బీసీలకు కేటాయించారు. మొత్తం సర్పంచ్ పదవుల్లో ఇవి 37.62 శాతం కావడం విశేషం. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు 37.62 శాతం సర్పంచ్ పదవులు దక్కనున్నాయి. జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసే వెసులుబాటు వుండడంతో జిల్లాలో బీసీలు సర్పంచులు అయ్యే పంచాయతీలు మరింత పెరిగే అవకాశం వుంది.
ఉమ్మడి జిల్లాలో 39 జడ్‌పీటీసీ స్థానాలు ఉండగా వీటిలో బీసీలకు ఈసారి ఆరు స్థానాలు (15.38 శాతం) కేటాయించారు. 2021లో తొమ్మిది స్థానాలు (23.08 శాతం) బీసీలకు కేటాయించారు. జడ్పీటీసీ స్థానాలు గతంతో పోలిస్తే మూడు తగ్గాయి.
ఎంపీటీసీ స్థానాల్లో పెరిగిన బీసీల వాటా
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలలో (ఎంపీటీసీ) బీసీల ప్రాతినిధ్యం మరింత పెరగనున్నది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 649 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో 183 స్థానాలను (28.20 శాతం) బీసీలకు రిజర్వు చేశారు. గత 2021 ఎన్నికల సమయంలో 652 ఎంపీటీసీ స్థానాలకు గాను 176 స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారు. మొత్తం మీద ఏడు స్థానాలకు బీసీలకు పెరిగాయి.
పంచాయతీ వార్డుల్లో...
గ్రామ పంచాయతీ వార్డు కేటాయింపులో కూడా బీసీలకు పెద్దపీట వేశారు. జిల్లాలో మొత్తం 6,304 గ్రామ పంచాయతీ వార్డులు ఉండగా వాటిలో 2,315 (27.17 శాతం) వార్డులను బీసీలకు కేటాయించారు. దీంతో సర్పంచ్ పదవులతోపాటు వార్డు సభ్యుల పదవుల్లో బీసీల ప్రాతినిధ్యం పెరగనున్నది. ఇక నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో మొత్తం 53 వార్డులు వుండగా, వీటిలో 20 వార్డులను (37.74 శాతం) బీసీలకు కేటాయించనున్నారు. గత ఎన్నికల్లో (2021) బీసీలకు 17 వార్డులు (32.08 శాతం) వార్డులను మాత్రమే కేటాయించారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ సిఫారసుల మేరకు జిల్లాలో ఆయా వర్గాల రిజర్వేషన్ స్థానాలు కూడా మారే అవకాశం వుంది.