చిన్న పరిశ్రమలకు పెద్ద పీట
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:29 AM
యువత ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోకుండా స్థానికంగానే ఉపాధి పొందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ పరిశ్రమలను స్థాపించే ఔత్సాహికులకు పలురకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నది.
ఔత్సాహికులకు ప్రభుత్వ ప్రోత్సాహం
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు
భూములు కేటాయింపు
మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏపీఐఐసీ
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించే వారికి ప్లాట్లు కేటాయింపు
రాంబిల్లి, అనకాపల్లి మండలాల్లో ఇప్పటికే పార్కులు ఏర్పాటు
స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
యువత ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస పోకుండా స్థానికంగానే ఉపాధి పొందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ పరిశ్రమలను స్థాపించే ఔత్సాహికులకు పలురకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నది. ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పున ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తున్నది.
అనకాపల్లి జిల్లాను తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మాదిరిగా అభివృద్ధి చేసి పారిశ్రామిక హబ్‌గా మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఇందులో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉద్యోగ, ఉపాధి లభించే చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి చొప్పున సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఎలమంచిలి, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం పూడి గ్రామ పరిధిలో సుమారు ఎనిమిదేళ్ల క్రితం టీడీపీ అధికారంలో వున్నప్పుడే ‘ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్’ పేరుతో ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుతోపాటు వివిధ వృత్తుల్లో నైపుణ్యం కోసం యువతకు శిక్షణ ఇస్తుంటారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అనకాపల్లి మండలం కోడూరులో ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేసి, మౌలిక సదుపాయాలు కల్పించారు. ఇందులో 250 యూనిట్లు స్థాపించాలన్నది లక్ష్యంకాగా ఇప్పటికే 200 మందికిపైగా ఔత్సాహికులకు ప్లాట్లు కేటాయించారు. మాడుగుల నియోజకవర్గం కె.కోటపాడు మండలం గొండుపాలెం, చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలం ఆర్.భీమరవంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు గత నెల 25వ తేదీన సీఎం చంద్రబాబునాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ రెండుచోట్ల భూమి చదును, మౌలిక సదుపాయాల కల్పన పనులు జోరుగా సాగుతున్నాయి. నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూలో ఏపీఐఐసీకి చెందిన 290 ఎకకాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయనున్నారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పరవాడలో ఏపీఐఐసీ సెజ్ ఫేజ్-2లో భాగంగా ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి కోటవురట్ల మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అయిన వంగలపూడి అనిత, అధికారులకు సూచించారు. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో సూక్ష, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. తద్వారా తలసరి ఆదాయం పెరుగుతుంది.