Share News

బిగ్గెస్ట్‌ బీచ్‌ ఫెస్టివల్‌

ABN , Publish Date - Jan 21 , 2026 | 01:15 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ ఉత్సవ్‌కు మంగళవారం శ్రీకారం చుట్టారు.

బిగ్గెస్ట్‌ బీచ్‌ ఫెస్టివల్‌

  • విశాఖ ఉత్సవ్‌ లాంఛనంగా ప్రారంభం

  • 3 జిల్లాలు, 20 వేదికలు

  • 500కు పైగా ఈవెంట్లు, 650 మంది కళాకారులు

  • విశాఖకు రీ బ్రాండింగ్‌ చేస్తూ ఉత్సవాలు

  • మంత్రుల ప్రకటన

విశాఖపట్నం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి):

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాఖ ఉత్సవ్‌కు మంగళవారం శ్రీకారం చుట్టారు. ప్రారంభ కార్యక్రమానికి సిరిపురం జంక్షన్‌లోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనా వేదికగా నిలిచింది. ఐదుగురు మంత్రులు, మూడు జిల్లాల కలెక్టర్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు అంతా ఒక వేదికపైకి వచ్చి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.

ఉత్సవాలను ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నిర్వహిస్తారు. ఇరవై వేదికలు, 500కు పైగా ఈవెంట్లలో 650 మంది కళాకారులు పాల్గొంటారు. వీరిలో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఉత్సవాల ద్వారా దాదాపు రూ.500 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయని చెబుతున్నారు. ఉత్సవం అంటే ఈవెంట్‌ మాత్రమే కాదని, ఆర్థిక సంపదను పెంచి, ఉపాధిని కల్పించే కార్యక్రమం అని అధికారులు వెల్లడించారు.

విశాఖకు కొత్త బ్రాండ్‌ ఇమేజ్‌

ఉత్సవ్‌ ప్రారంభ కార్యక్రమంలో పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్‌ మాట్లాడుతూ వైసీపీ పాలనలో విశాఖపట్నానికి చెడ్డపేరు వచ్చిందని, పెట్డుబడిదారులు భయపడ్డారని, దానిని పూర్తిగా చెరిపేసి కొత్త బ్రాండ్‌ క్రియేట్‌ చేస్తూ మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఈ ఉత్సవ్‌ నిర్వహిస్తామన్నారు. దీనికి ‘బిగ్గెస్ట్‌ బీచ్‌ ఫెస్టివల్‌’గా బ్రాండింగ్‌ చేస్తున్నామన్నారు. స్థానిక ప్రజల సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా ఈ ప్రాంతం పేరు మారుమోగేలా ఉత్సవాలు ఉంటాయన్నారు. ఇప్పటికే ఫ్లెమింగో ఫెస్టివల్‌, అమరావతి-ఆవకాయ వంటివి నిర్వహించామని, త్వరలో నంది అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నామని వెల్లడించారు. రాష్ట్రం అంతటా ఉత్సవ వాతావరణం ఉండాలనేదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పర్యాటక రంగానికి ఇప్పటికే పరిశ్రమ హోదా కల్పించామన్నారు. ఈ ఉత్సవాలు అభివృద్ధి సూచికలని, అనుభూతి చెందాలని పిలుపునిచ్చారు. విశాఖ ఎంపీ శ్రీభరత్‌ మాట్లాడుతూ, మూడు జిల్లాల్లో నిర్వహించడం ఒక కొత్త అనుభవమని, ఇది ఏటా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, అనకాపల్లి ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, ఏపీటీడీసీ సీఈఓ అమ్రపాలి ప్రసంగించారు. ఈ సందర్భంగా విశాఖ ఉత్సవ్‌ లోగోను, వివిధ పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

Updated Date - Jan 21 , 2026 | 01:15 AM