Share News

సేంద్రియ సాగుకు పెద్దపీట

ABN , Publish Date - May 09 , 2026 | 10:39 PM

జిల్లాలో సేంద్రియ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది.

సేంద్రియ సాగుకు పెద్దపీట
ట్రాక్టర్‌తో పచ్చిరొట్ట ఎరువుని కలియదున్నుతున్న రైతు (ఫైల్‌)

భూసారం పెంపు కోసం పచ్చిరొట్ట ఎరువులు

గిరిజన రైతులకు 90 శాతం రాయితీ

జిల్లాకు తొలివిడతగా 946 క్వింటాళ్ల విత్తనాలు

చింతపల్లి, మే 9 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో సేంద్రియ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజులపాటు అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో అల్లూరి జిల్లాను ఆర్గానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఈమేరకు గిరిజన రైతులు సేంద్రీయ పద్ధతుల్లో పంటలను పండించేందుకు జిల్లా కలెక్టర్‌ టి. నిషాంతి వ్యవసాయ అధికారులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. సేంద్రియ సాగులో భాగంగా గిరిజన రైతులను రసాయనిక ఎరువులను దూరం చేయడంతోపాటు భూసారం పెంపొందించేందుకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. కట్టె జనుము, పిల్లిపెసర, జీలుగు విత్తనాలు పంపిణీకి చర్యలు ప్రారంభించారు. ఎకరానికి 10-12 కిలోలు చొప్పున గరిష్ఠంగా ఐదు ఎకరాలకు విత్తనాలు పంపిణీ చేయనున్నారు. గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై అందజేయనున్నారు. జిల్లాలోని 11 మండలాలకు తొలివిడతగా కట్టె జనుము 612, జీలుగ 171, పిల్లి పెసర 163 క్వింటాళ్లను ఏపీసీడ్స్‌ ద్వారా పంపిణీ చేయనున్నారు.

పచ్చిరొట్టతో బహుళ ప్రయోజనాలు

పచ్చిరొట్ట ఎరువులతో పంటలకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయి. మితిమీరిన రసాయన ఎరువుల వాడడంతో భూముల్లో పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. భూసారం తరిగిపోయి, పోషకాల లోపం, చీడపీడలు తాకిడి పెరిగిపోతోంది. ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు తక్కువ ఖర్చుతో పచ్చిరొట్ట పైరు ప్రధాన భూమిక పోషిస్తోంది. పచ్చిరొట్ట పెంపకంతో భూసారం పెరుగుతోంది. రానున్న ఖరీఫ్‌కి రైతులు వేసవి దుక్కులు చేసుకుని పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు చల్లుకొని భూమిలో కలియదున్నుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చు.

నాట్లుకి ఇదే అదును

ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఈవారంలోనే పచ్చిరొట్ట ఎరువు నాట్లు వేసుకోవాలి. సాధారణ దిగుబడి రావడానికి కనీసం 45 రోజులు పడుతోంది. పూత దశలో కలియ దున్నినపుడు అత్యధికంగా పొలాల్లో భూసారం పెరుగుతోంది. పొలంలో నీరు చేరిన వెంటనే పచ్చిరొట్ట పైరును కలియదున్నడం పూర్తిచేయాలి.

జీలుగ: ఎకరాకు 12-15 కిలోల విత్తనం అవసరం. ఈ మొక్కలు వేర్ల మీద నత్రజని నిల్వ చేసే బుడిపెలు కలిగివుంటాయి.50-55రోజుల్లో కలియదున్నాలి. టన్ను పచ్చిరొట్ట ఎరువు నుంచి సుమారు 5 కిలోల నత్రజని, 0.6 శాతం భాస్వరం, 1.2శాతం పొటాష్‌ ఇస్తోంది.

కట్టె జనుము: ఎకరానికి 10-15 కిలోల విత్తనం అవసరం. పూతదశలో 45-50 రోజులకు కలియదున్నాలి. ఒక టన్ను నుంచి 4కిలోల నత్రజని, 0.5శాతం భాస్వరం, 1.8శాతం పొటాష్‌ లభిస్తుంది.

పిల్లిపెసర: ఎకరానికి 5-6 కిలోల విత్తనం అవసరం. పూతదశ 50-55 రోజుల్లో కలియదున్నాలి. ఒక టన్ను పచ్చిరొట్ట నుంచి 7.2కిలోల నత్రజని, ఒకకిలో భాస్వరం, 5.3కిలోల పొటాష్‌ లభిస్తోంది.

90శాతం రాయితీపై విత్తనాలు

బీవీ తిరుమలరావు, ఏడీఏ, చింతపల్లి

గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై ప్రభుత్వం పచ్చిరొట్ట కిట్లను అందజేస్తుంది. రైతు కిలోకి 10శాతం ధర మాత్రమే చెల్లించాలి. రైతు సేవా కేంద్రాలకు ఐదు రోజుల్లో పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు రానున్నాయి. రైతులు ఆధార్‌ కార్డు, పాస్‌ పుస్తకం నఖలు తీసుకొచ్చి పచ్చిరొట్ట విత్తనాలు తీసుకోవచ్చు. విత్తనం తీసుకున్న వెంటనే నాట్లు వేసుకోవాలి.

Updated Date - May 09 , 2026 | 10:39 PM