పాఠశాలల్లో వసతికి పెద్దపీట
ABN , Publish Date - Jan 23 , 2026 | 10:23 PM
గిరిజన ప్రాంతంలో ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి, వసతి భవనాల నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. తొలివిడతగా చింతపల్లి సబ్ డివిజన్‌కు రూ.20.5కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో ఇంజనీరింగ్ అధికారులు నిర్మాణ పనులను ప్రారంభించారు. వచ్చే విద్యాసంవత్సరం పునఃప్రారంభం నాటికి నూతన భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
అదనపు తరగతి, వసతి భవనాల నిర్మాణాలు
ప్రత్యేక నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వం
చింతపల్లి సబ్ డివిజన్‌లో
తొలివిడతగా రూ.20.5కోట్లు విడుదల
చింతపల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వం నాడు-నేడు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ ఎక్కడా అదనపు తరగతి గదులను నిర్మించలేదు. మెజారిటీ పాఠశాలల్లో నాడు-నేడు పనులు ఇప్పటికీ అసంపూర్తిగా పడివున్నాయి. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో విద్యావ్యవస్థ బలోపేతానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. విద్యార్థులకు తగిన తరగతి గదులు, ఆశ్రమ పాఠశాలల్లో అదనపు వసతి గృహాల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ వార్షిక సంవత్సరంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా డీఏ-జుగా, టైప్-4, పీఎం జన్‌మన్, ఏడబ్ల్యూఈఅండ్‌బి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులతో పాఠశాలల్లో అదనపు తరగతి, వసతి భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. నిర్మాణ బాధ్యతలను గిరిజన సంక్షేమ శాఖ, సోషల్‌వెల్ఫేర్, ఏపీఈడబ్ల్యూఐడీసీ, సమగ్ర శిక్ష ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించారు.
చకచకా అదనపు వసతి, తరగతి భవనాల నిర్మాణాలు
సబ్ డివిజన్ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ 18.42 కోట్లతో ఆరు పాఠశాలల్లో అదనపు తరగతి, వసతి భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. లంబసింగి బాలిక ఆశ్రమ పాఠశాలలో పీఎం జన్‌మన్ పథకం రూ.2.75కోట్ల నిధులతో జీ ప్లస్ వన్ భవనం నిర్మాణం జరుగుతున్నది. చింతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో టైప్-4 పథకం రూ.2.5కోట్లతో పీ ప్లస్ వన్ అదనపు వసతి భవనం నిర్మాణం జరుగుతున్నది. డీఏ-జుగా పథకంలో చింతపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలలో రూ.2.11కోట్లతో జీ ప్లస్ వన్, జీకేవీధి మండలం రింతాడ బాలికల ఆశ్రమ పాఠశాలలో రూ.4.55కోట్లతో జీ ప్లస్ టూ, కొయ్యూరు బాలుర ఆశ్రమ పాఠశాల-1లో రూ.4.7కోట్లతో జీ ప్లస్ టూ అదనపు తరగతి, వసతి గృహాల భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
రూ.1.8కోట్లతో ఈఎంఆర్ ఉపాధ్యాయుల వసతి గృహం
చింతపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో అదనపు ఉపాధ్యాయుల నివాస గృహాలు నిర్మించేందుకు డీఏ-జుగా పథకం ద్వారా రూ.1.8కోట్లను కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. పాఠశాల ఆవరణలో ఈ నిధులతో ఉపాధ్యాయులకు అదనంగా ఆరు నివాస గృహాలను నిర్మిస్తున్నది. మరో వారం రోజుల్లో పనులు ప్రారంభించనున్నారు.
ప్రాథమిక పాఠశాలకు అదనపు తరగతి భవనాలు
కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లో 14 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అదనపు తరగతి భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం ఏడబ్ల్యూఈ అండ్ బీ పథకం ద్వారా రూ.1.82 కోట్లను మంజూరు చేసింది. ఒక్కొక్క పాఠశాల భవన నిర్మాణానికి రూ.13.05లక్షలను కేటాయించింది. కొన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభం కాగా, మరి కొన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభించాల్సి వున్నది. 14 పాఠశాలల నిర్మాణాలను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు కేటాయించారు.
నవంబరు నాటికి నిర్మాణాలు పూర్తి
జి. రఘునాథరావు నాయుడు, డీఈఈ, గిరిజన సంక్షేమ శాఖ, చింతపల్లి.
గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో అదనపు తరగతి భవనాల నిర్మాణాలను ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేస్తాం. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి గ్రౌండ్‌ఫ్లోర్ అందుబాటులోకి తీసుకొస్తాం. నిర్మాణాలకు నిధుల కొరత లేదు. పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించాం. నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణాలు చేపడుతున్నాం. ఈ భవనాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు వసతి సమస్య తీరుతుంది.