Share News

సైకిల్‌పై సాహస యాత్ర

ABN , Publish Date - Feb 27 , 2026 | 11:36 PM

పలు ప్రాంతాల భాష, ఆచార, సంప్రదాయాలను తెలుసుకునేందుకు మూడు ప్రాంతాలకు చెందిన యువకులు సైకిల్‌పై సాహస యాత్ర ప్రారంభించారు.

సైకిల్‌పై సాహస యాత్ర
యువ సైక్లిస్ట్‌లు మనోజ్‌, విక్రమ్‌, బిక్కుపటేల్‌

వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకుల ప్రయాణం

పలు ప్రాంతాల భాష, ఆచార, సంప్రదాయాలపై అధ్యయనం

అనంతగిరి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పలు ప్రాంతాల భాష, ఆచార, సంప్రదాయాలను తెలుసుకునేందుకు మూడు ప్రాంతాలకు చెందిన యువకులు సైకిల్‌పై సాహస యాత్ర ప్రారంభించారు. వీరంతా శుక్రవారం అనంతగిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా యువ సైక్లిస్ట్‌ జి.మనోజ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ కడప ప్రాంతానికి చెందిన తాను, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌కు చెందిన విక్రమ్‌ కలిసి ఈ నెల 10న హైదరాబాద్‌ నుంచి సైకిల్‌ యాత్ర ప్రారంభించామన్నారు. హైదరాబాద్‌, కడప, విజయవాడ, తుని, నర్సీపట్నం, పాడేరు, అరకు మీదుగా అనంతగిరి చేరుకున్నామని చెప్పారు. పలు ప్రాంతాల్లో భాష, ఆచార, సంప్రదాయాలపై అధ్యయనం చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. గతంలో ఆలిండియా సైకిల్‌ యాత్రలో భాగంగా తొమ్మిది వేల కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర చేసినట్టు చెప్పారు. ఇప్పుడు విక్రమ్‌తో కలిసి హైదరాబాద్‌ నుంచి 1400 కిలోమీటర్లు ప్రయాణించానన్నారు. మార్గమధ్యంలో బిహార్‌కు చెందిన సైక్లిస్ట్‌ బిక్కుపటేల్‌ కలిశారని, ఆయన జ్యోతిర్లింగాలను దర్శించుకుని వస్తూ విజయవాడలో తమతో కలిశారన్నారు. అక్కడ నుంచి తామంతా కలిసే ప్రయాణం సాగిస్తున్నామని తెలిపారు. తాము విశాఖపట్నం మీదుగా ఒడిశాలోని పూరీకి వెళుతున్నామని ఆయన చెప్పారు.

Updated Date - Feb 27 , 2026 | 11:36 PM